Perni Nani : మెగాస్టార్ చిరంజీవిపై మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలెందుకు చేశారు.?

Perni Nani :  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి నేరుగా అపాయింట్మెంట్ రాకుండా హైద్రాబాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్ళి, ‘లంచ్ మీటింగ్’ అధికారికంగా ముఖ్యమంత్రితో చేసే అవకాశం వుండదు కదా.?

ఏదో బంధుత్వం కొద్దీ వైఎస్ జగన్, చిరంజీవి ‘లంచ్ మీటింగ్’ పెట్టుకున్నారని అనగలమా.? అలాంటి బంధుత్వమేదీ ఇరువురి మధ్యా లేదు. కేవలం సినీ పరిశ్రమ సమస్యలపైనే చిరంజీవి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. సాదరంగా చింరజీవిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.. ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి.

‘లంచ్ మీటింగ్ మాత్రమే.. ఈ క్రమంలో పలు అంశాలు చర్చకు వచ్చి వుంటాయి. అంతే తప్ప, పరిశ్రమ వ్యవహారాలపై అధికారిక భేటీ అనలేం.. అలాంటి చర్చలేమైనా వుంటే సచివాలయంలో జరుగుతాయ్..’ అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.

‘పేర్ని నాని అహంకారానికి ఇదే నిదర్శనం. సినిమాటోగ్రఫీ శాఖ ఇటీవల మంత్రి పేర్ని నాని దగ్గరకు వెళ్ళడంతో, ఆయనలో అహంకారం పెరిగింది. సినిమా వ్యవహారాల్ని చిరంజీవి తన వద్ద చర్చించకుండా నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి చర్చించడమేంటన్న భావనతో వున్నట్టున్నారు..’ అంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచాయి. చిరంజీవి విషయంలో వైసీపీ మద్దతుదారులు ఒకింత సానుకూల వైఖరితోనే వుంటారు. మూడు రాజధానుల విషయంలో చిరంజీవి, వైసీపీ ప్రభుత్వ ఆలోచనకు మద్దతివ్వడమూ అందుకు ఓ బలమైన కారణం.

అయితే, చిరంజీవి – వైఎస్ జగన్ భేటీ విషయంలో మంత్రి పేర్ని నాని ‘తేలిక’ వ్యాఖ్యలు చేశారంటే, ఈ వ్యాఖ్యల వెనుక బలమైన కారణమే వుండి వుండొచ్చన్న వాదనా లేకపోలేదు. ఆ కారణం ఏదైనా కావొచ్చు, సాక్షాత్తూ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చాక, ఈ వ్యవహారంలో పేర్ని నాని మాట్లాడటానికేముంటుంది.?