2019 ఎన్నికల సమయంలో చెప్పిన నవరత్నాలను అమలు చెయ్యడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒకటి నుంచి పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు పుస్తకాలు, బ్యాగ్, షూ, సాక్స్.. లతో ఓ కిట్ ఇస్తూ ‘జగనన్న విద్యా కానుక’ అని ప్రింట్ కూడా వేశారు. ఈ పథకానికి 650 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం చెప్పుకుంది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యగ్యాంస్త్రాలు సంధించారు.
పథకం పేరు మార్చమన్న పవన్
అయితే ఈ పథకం కోసం 650కోట్లు ఖర్చు చేస్తున్నామని వైసీపీ నాయకులు చెప్తుండటంతో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ…ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చులు 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు – 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపే ఒక టేబుల్ ను కూడా ఆయన పోస్ట్ చేశారు. అందుకే ఈ పథకానికి “మోడీ-జగనన్న విద్యాకానుక” అనే పేరు పెడితే బాగుంటుందని తెలిపారు. వైసీపీ నాయకులు చేసుకుంటున్న తప్పుడు ప్రచారంపై తనదైన శైలిలో పవన్ కౌంటర్ ఇచ్చారు.
బీజేపీకి లేని కోపం పవన్ కు ఎందుకు ?
జగనన్న విద్యాకానుక పథకంలో కేంద్రం వాటా ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఆ విషయం చెప్పకుండా తామే ఇస్తున్నట్టు బయటకు కలరింగ్ ఇస్తున్నప్పటికి రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ కేంద్ర బీజేపీ నాయకులు కానీ ఎవ్వరు కూడా జగన్ ను విమర్శించలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏకంగా పథకం పేరులో ప్రధాని మోడీ పేరును కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాజకీయ వర్గాలు బీజేపీ నేతలకు రాని కోపం పవన్ కు ఎందుకు వచ్చిందనే సందేశాన్ని వెళ్లబుచ్చుతున్నారు. జగన్ ఎలాగో కొన్నిరోజుల్లో ప్రధాని మోడీ కోరిక మేరకు ఎన్డీయే చెంతకు చేరనున్నారు కాబట్టి అందుకే బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు న్చెయ్యడం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.