Raju : రఘురామ ఆవేదన: ‘బండి’కి ఒకలా, ‘రాజు’కి ఇంకోలా.!

Raju : బండి సంజయ్ కూడా ఎంపీనే, నేను కూడా ఎంపీనే. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కావొచ్చు. అందుకే, ఆయన విషయంలో వేగంగా లోక్‌సభ, కేంద్ర హోం శాఖ స్పందించి వుండొచ్చు. నా విషయంలో కాస్త లేటుగా అయినా, కేంద్ర హోం శాఖ అలాగే లోక్ సభ స్పందిస్తుందనే ఆశిస్తున్నానంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఒకింత ‘నిర్వేదం’తో వ్యాఖ్యానించారు.

ఇటీవలే బండి సంజయ్ మీద తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం, ఆయన్ని అరెస్ట్ చేయడం తెలిసిన విషయాలే. ఈ క్రమంలో పెద్ద గలాటానే చోటు చేసుకుంది. ఆ తర్వాత బండి సంజయ్ బెయిల్ మీద విడుదలయ్యారనుకోండి.. అది వేరే సంగతి. తాజాగా, ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులకు నోటీసులు అందాయి.!

లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి బండి సంజయ్ ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదుపై స్పందనగా, తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ అవడం చకచకా జరిగిపోయాయి. మరి, రఘురామ కూడా గతంలో తనపై ఏపీ సీఐడీ పోలీసులు దాడి చేశారనీ, తనను చంపాలనుకున్నారనీ ఆరోపిస్తూ లోక్ సభ స్పీకర్‌కి, లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి, కేంద్ర హోం శాఖకీ ఫిర్యాదు చేస్తే, ఇప్పటిదాకా అట్నుంచి రఘురామ ఆశించిన స్పందన ఎందుకు రాలేదట.?

ఇక్కడ విషయం సుస్పష్టం. రఘురామ హద్దులు మీరి ముఖ్యమంత్రిని ఉద్దేశించి దుర్భాషలాడారు. ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సరే, అరెస్టు తర్వాత ‘చావబాదుడు’ జరిగిందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. బండి సంజయ్ విషయంలో పరిణామాలు వేగంగా జరగడానికి, రఘురామకు అట్నుంచి స్పందన సరిగ్గా రాకపోవడానికీ కారణాలు చాలానే వున్నాయ్. రఘురామ ఎంత నిర్వేదం వ్యక్తం చేసినా ఉపయోగం వుండకపోవచ్చు.