NTR Statue : ఎన్టీయార్ విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేయాలనుకున్నారు.?

NTR Statue : స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని వైసీపీ నేత (కింది స్థాయి నేత) ఒకరు దుర్గిలో ధ్వంసం చేసేందుకు యత్నించడం రాష్ట్రంలో పెను రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. దేవుళ్ళ విగ్రహాలకే దిక్కులేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక, రాజకీయ నాయకుల విగ్రహాలపై దాడులు జరగడంలో వింతేముంది.? ఆ మాటకొస్తే, మహనీయులు అంబేద్కర్ తదితరుల విగ్రహాలూ ధ్వంసమైన ఘటనలు చాలానే కనిపిస్తాయి.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా వుందన్నది ఇలాంటి ఘటనల్ని చూస్తేనే అర్థమవుతోందన్న విమర్శ ఇలాంటి సందర్భాల్లో వినిపిస్తే అది తప్పెలా అవుతుంది.? కొందరు పనిగట్టుకుని ఇలాంటి దాడులకు తెగబడుతున్నమాట వాస్తవం. వారిని పోలీసులు నిలువరించలేకపోతున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అకస్మాతుత్తగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

అన్ని చోట్లా పోలీసులు వుండలేరు.. కానీ, ఘటన జరిగాక నిందితుల్ని పట్టుకోవడం, వారికి కఠినంగా శిక్ష పడేలా చేయగలిగితే, విగ్రహాలపై దాడులు జరగవు. ఇలాంటి ఘటనల్ని విపక్షాలు రాజకీయంగా తమకు అనుకూలంగా వాడుకోకుండా వుంటాయా.? ఛాన్సే లేదు.

ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంటుంది. స్వర్గీయ ఎన్టీయార్ విగ్రహం విషయంలో టీడీపీ రాజకీయమే చేస్తోంది. టీడీపీ ఆరోపణల్ని తప్పు పట్టడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది మరి.

స్వర్గీయ ఎన్టీయార్ విగ్రహ ధ్వంసానికి వైసీపీ నాయకుడే తెగబడ్డంతో కొందరు వైసీపీ నాయకులు ఈ దాడిని తీవ్రంగా ఖండించేశారు. నిజానికి, దేవాలయాలపై దాడులు జరిగినప్పుడే వైసీపీ నేతలు ఈ దాడుల్ని ఖండించి వుండాలి. ఖండించలేదు. పైగా, ‘విరిగింది ఆంజనేయస్వామి బొమ్మ తాలూకు చెయ్యే కదా..’ అంటూ వెటకారాలు చేశారు మంత్రులు. ఏదిఏమైనా, ఇలాంటి ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టనే దెబ్బతీస్తాయని అధికార పార్టీ నేతలు గుర్తెరిగితే మంచిది.