CID Notices : మళ్ళీ అరెస్టవ్వాల్సి వస్తుందేమోనని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెగ బాధపడిపోతున్నట్టున్నారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావడంలేదు.. కోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టింది. ముఖ్యమంత్రి పదవిలో వుండి, ఆయనే బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదు. నాకు పండగ పూట విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపడమేంటి.?’ అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెగ ఆవేదన వ్యక్తం చేసేస్తున్నారు.
ఏపీ సీఐడీ అందించిన నోటీసులకు రఘురామ ఇంతలా భయపడాల్సిందేముంది.? అంటే, గతంలో ఆయనకు ఎదురైన చేదు అనుభవం అలాంటిది.. అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. గతంలో ఏం జరిగింది.? అంటే, విచారణకు పిలిచారు.. అరెస్టు చేశారు.. ఆ తర్వాత రఘురామ బెయిల్ తీసుకున్నారు.
కానీ, హైద్రాబాద్ నుంచి విజయవాడకు తరలించడం.. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు, గలాటా.. అందరికీ తెలిసిందే. తనను చావబాదారంటూ రఘురామ ఆరోపిస్తున్నారు. అదంతా అబద్ధమని ఏపీసీఐడీ అంటోంది. ఏది నిజమో.. ఏది అబద్ధమో ఇప్పటిదాకా తేలలేదు, భవిష్యత్తులో తేలుతుందన్న నమ్మకమూ లేదు.
నిజానికి, రఘురామకృష్ణరాజుకి ఇదొక సదవకాశం. నియోజకవర్గ ప్రజల్ని కలిసేందుకు వీలు కలుగుతుంది. సరే, అలా కలవకుండా ఆయన్ని అరెస్టు చేస్తేనో.? అన్నది వేరే చర్చ. అరెస్టయితే సింపతీ వస్తుంది. ‘చావబాదడం అనే ఎపిసోడ్ ఇంకోసారి పునరావృతమవుతుందేమో..’ అన్న అనుమానాల్లో విశ్వసనీయత ఎంత.? అన్నది మళ్ళీ వేరే చర్చ.
ఈసారి కూడా అరెస్టు చేస్తే, ‘మళ్ళీ చావబాదారు’ అన్న ఆరోపణలు తెరపైకి వస్తే, వ్యవహారం చాలా సీరియస్ అవుతుంది. ఎందుకంటే, ‘కొట్టుడు వ్యవహారం’పై కోర్టులో విచారణ జరుగుతోంది గనుక. సో, ఎలా చూసినా అడ్వాంటేజ్ రఘురామకే వుంది. కానీ, ఆయనెందుకు భయపడుతున్నట్టు.?