మాట తప్పలేదు: విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ రఘురామ పిటిషన్

ఎ1 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు జరిగి తీరుతుందని గట్టిగా నమ్ముతున్నారు రాజద్రోహం కేసులో ఏ1 అయిన రఘురామకృష్ణరాజు. ఇప్పుడు ఏ2 విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేశారు.. నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు.. అనుకోవాలా.? ఏంటో, రాజకీయాల్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారు.? ఎందుకు మాట్లాడుతున్నారు.? సోయ వుండే రాజకీయాలు చేస్తున్నారా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయ్ జనాలకి. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఏ1 అయితే, విజయసాయిరెడ్డి ఏ2. ఇది అందరికీ తెలిసిన విషయమే. అది తెలిసే, వైసీపీలో చేరారు రఘురామ. ఆ జగన్ దయతోనే రఘురామ ఎంపీ అయ్యారు. ఇప్పుడేమో, రఘురామ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏ1 అంటున్నారు.. జగన్ బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ సంగతి జనవరి 25న తేలిపోనుంది. ఇంతలోనే విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టును ఆశ్రయించడం గమనార్హం. అంతకంటే ముందు, రఘురామ పాస్‌పోర్టుని స్వాధీనం చేసుకోవాలనీ, ఆయన దేశం విడిచి పారిపోకుండా చూడాలని విజయసాయిరెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఇంకోపక్క, తాను విదేశాలకు వెళ్ళేందుకు విజయసాయిరెడ్డి ఇటీవల కోర్టుకు విజ్ఞప్తి చేశారు.. ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారాయె. ఏ పార్టీ నుంచి గెలిచారో, ఏ పార్టీ అధినేత చలవతో రాజకీయంగా ఉన్నత స్థానంలో నిలబడ్డారో.. రఘురామరాజు.. అదే పార్టీపైనా, అదే పార్టీ అధినేతపైనా అవాకులు చెవాకులు పేలినందుకు రాజద్రోహం కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.