సాటి ఎంపీ తనను బెదిరిస్తున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకీ ఫిర్యాదు చేశారు. ఆ సాటి ఎంపీ ఎవరో కాదు గోరంట్ల మాధవ్. పార్లమెంటు ప్రాంగణంలోనే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనను బెదిరించారన్నది రఘురామ ఆరోపణ. మంగళవారం ఉదయం లోక్ సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాలులో వున్న తన వద్దకు వచ్చి మరీ ఎంపీ గోరంట్ల తనను బెదిరించారని రఘురామ ఆరోపిస్తున్నారు. నిజానికి, ఇది అత్యంత తీవ్రమైన ఆరోపణగానే పరిగణించాలేమో. ఎందుకంటే, పార్లమెంటు సాక్షిగా ఇలాంటి వ్యవహారాలు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ వ్యవహారాలపై లోక్ సభ స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాల్సి వుంటుంది.
అయితే, అంతటి సాహసం గోరంట్ల మాధవ్ చేస్తారా.? అసలాయనకేంటి ఆ అవసరం.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. గోరంట్ల మాధవ్ తన దగ్గరకు వచ్చేముందు వైసీపీ ఎంపీలతో చర్చించారనీ, వాళ్ళే ఆయన్ని రెచ్చగొట్టి వుంటారనీ రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. గోరంట్లపై చర్యలు తీసుకోవాలని అటు ప్రధానికీ, ఇటు లోక్ సభ స్పీకర్‌కీ విజ్ఞప్తి చేశారు రఘురామ. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కూడా రఘురామ తన ఫిర్యాదులో కోరారు. పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలకు అదనపు రక్షణ ఏంటి.? నిజానికి ఇది పార్లమెంటు ప్రతిష్టను దెబ్బ తీసే అంశంగా చూడాలన్నది చాలామంది అభిప్రాయం. పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలకు భద్రత లేని పరిస్థితి రావడమేంటి.? అన్న చర్చ తెరపైకి రావడం సహజమే కదా. వైసీపీ పేరు చెబితే చాలు తోక తొక్కిన తాచులా చెలరేగిపోతున్న రఘురామ, ఇంత తీవ్రమైన ఆరోపణలు ఈసారి వైసీపీ ఎంపీ గోరంట్ల మీద చేసిన దరిమిలా, ఈ వ్యవహారం ఎలా ముదిరి పాకాన పడుతుందో వేచి చూడాలి.