కొన్నాళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రపదేశ్ గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్స తీసుకోవడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ప్రభుత్వాసుపత్రులకు వైద్య చికిత్స నిమిత్తం నాయకులు వెళితే, వాటిపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని నరసింహన్ చెబుతుండేవారు. విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్, ప్రభుత్వాసుపత్రిలోనే శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత అలాంటి సాహసం ఇంకెవరూ చేయలేకపోయారు.
కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులంతా ఛలో హైద్రాబాద్.. అంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే వారికి వైద్య చికిత్స అందుతోంది. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అత్యద్భుతమైన వైద్య సేవలు అందించేస్తున్నామని అధికార వైసీపీ చెప్పుకుంటోందిగానీ, వైసీపీలో ఎవరికన్నా కరోనా వస్తే, ఆగమేఘాల మీద హైద్రాబాద్ పారిపోవాల్సి వస్తోంది వైద్య చికిత్స కోసం. ఇదీ, రాష్ట్రంలో తమ పాలనపై వైసీపీ నేతలకు వున్ననమ్మకం. ఆ సంగతి పక్కన పెడితే, కరోనా వస్తే భయపడాల్సిన పనిలేదనీ, ప్రైవేటు ఆసుపత్రుల వైపు చూడొద్దనీ, ప్రభుత్వాసుపత్రుల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనీ మంత్రి ఈటెల రాజేందర్ మొత్తుకుంటున్నా, తెలంగాణ నేతలు మాత్రం, కార్పొరేట్ ఆసుప్రతులే మిన్న.. అంటున్నారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు జరిగాయి.
కరోనా నుంచి దాదాపుగా ఆయన కోలుకున్నట్టేనని వైద్య పరీక్షల అనంతరం వైద్యులు వెల్లడించారు. నిజానికి, ఏదన్నా ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి కేసీఆర్, అక్కడ చికిత్స పొంది వుంటే ప్రజల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకం పెరిగేదే. ‘ప్రోటోకాల్ నేపథ్యంలో భద్రత కష్టమవుతుంది.. సెక్యూరిటీ వల్ల ఇతర రోగులకు సమస్యలొస్తాయి..’ అని అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ వర్గాలు చెప్పే సమాధానంలో ఎంతవరకు చిత్తశుద్ధిని మనం కనుగొనగలం.?