2019 ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీల ఏకైక మంత్రం “ప్రత్యేక హోదా సాధిస్తాం” అని చెప్తూ ప్రచారం చేసుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణం కూడా ప్రత్యేక హోదాపై మాట మార్చి, స్పెషల్ ప్యాకేజి అంటూ కబుర్లు చెప్పడం వల్లే ఘోరమైన ఓటమిని మూటకట్టుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఏకైక కారణం ఆయన ప్రత్యేక హోదాను సాధిస్తారనే ఉద్దేశంతోనే. అయితే ఆయన అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రం మెడలు వంచుతామని కబుర్లు చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేవారు అడుగుతూనే ఉంటామని మాట మారుస్తున్నారు.
హోదా కోసం కేంద్రం మెడలు జగన్ వంచలేరా!
హోదా ఇవ్వకపోతే కేంద్రం మెడలు వంచి తీసుకువస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు మౌనంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు మాత్రం అర్ధం కావడం లేదు. అయితే ఇప్పుడు ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హోదా కోసం కేంద్రంతో పోరాడితే తనపైన ఉన్న కేసుల విషయంలో తాను మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడే హోదా కోసం జగన్ కేంద్రం పెద్దలతో మాట్లాడటం లేదని టీడీపీ నాయకులు చెప్తున్నారు. కేంద్ర పెద్దలతో జగన్ వ్యవహారం చూస్తుంటే టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందనిపిస్తుంది. ఈ కేసులు భయం జగన్ లో ఉన్నంత కాలం కేంద్రాన్ని హోదా గురించి అడగటం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
న్యాయ వ్యవస్థ << ప్రత్యేక హోదా
గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థపై వైసీపీ నాయకులు పలు రకాలైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా న్యాయ వ్యవస్థపై పోరాటానికి శంఖం పూరించారు. అయితే ఈ పోరాటంపై జగన్ కనపరుస్తున్న ఆసక్తిని చూసిన రాష్ట్ర వాసులు, జగన్ ఇదే రేంజ్ లో ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడటం లేదని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ గొప్ప ధీరుడు కావడం కారణంగానే న్యాయ వ్యవస్థ పై పోరాటం మొదలు పెట్టాడు అన్న జగన్ మీడియా కథనాల పట్ల ప్రజలలో సానుకూల స్పందన రావడం లేదు. నిజంగా అంత ధీరుడే అయి ఉంటే, ప్రత్యేక హోదా కోసమో, ప్రజా ప్రయోజనాల కోసమో కేంద్రంతో పోరాడి ఉంటే ప్రజల్లో మరింత మైలేజ్ వచ్చి ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థపై పోరాటం కంటే కూడా హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.