రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలాన విసిరేసినట్లు ఉంటుంది విజయనగరం జిల్లా. ఒకప్పుడు రాజులూ ఏలిన ప్రాంతంగా దానికి మంచి పేరు ఉంది. అలాంటి జిల్లాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలా మక్కువని తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో అక్కడ ఉన్న9 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ భారీ విజయాన్ని సాధించి క్లిన్ స్వీప్ చేసిందంటే దానికి కారణం అక్కడి స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలే. నమ్మితే తలమీద పెట్టుకొని చూసుకునే గొప్ప మనసున్న జిల్లా విజయనగరం.
అందుకే సీఎం జగన్ తన క్యాబినెట్ లో రెండు మంత్రి పదవులు, వాటిలో ఒకటి డిప్యూటీ సీఎం హోదా కలిగింది కట్టబెట్టాడు. దీనితో అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, పరుగులు పెడుతుంది. అయితే నేతలు బాగుపడ్డారు కానీ, ద్వితీయ శ్రేణి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎలాంటి పదవులు లేకపోవటంతో అసంతృప్తితో ఉన్నారు. దీనిని గమనించిన సీఎం జగన్ కొత్తగా ప్రకటించిన సామాజిక వర్గ కార్పొరేషన్స్ పదవులు ఒక్క విజయనగరం జిల్లాకే 4 కేటాయించటం విశేషం.
కొప్పుల వెలమ,శిష్టికారణం, తూర్పుకాపు,దాసరి కులాలకు చెందిన నలుగురు నేతలకు జగన్ పదవులు ఇవ్వటానికి జగన్ సిద్దమయ్యాడు. దీనితో అక్కడి స్థానిక నేతలు సీఎం జగన్ కు పాలాభిషేకాలు, బైక్ ర్యాలీలు చేస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పదవులు దక్కబోతున్నాయనే సంతోషంలో అక్కడి వైసీపీ నేతలు వున్నారు. ఇదే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులకు, మంత్రులకు మరో రకమైన భయం పట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా నాలుగు పదవులు ఇచ్చారు. ప్రతి పదవికి దాదాపు అరడజను మంది నేతలు పోటీపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఆయా నేతలు తమకున్న పరిచయాలను ఉపయోగించుకొని ఇంచార్జి స్థాయి నుండి మంత్రి స్థాయి వరకు లాబీయింగ్ మొదలుపెట్టారు.
దీనితో అక్కడి అగ్రశ్రేణి నేతలకు తలనొప్పిగా మారిపోయాయి ఈ పదవులు. పదవుల పంపకం సరిగ్గా జరగకపోతే దాని ప్రభావం పార్టీ మీద పడే అవకాశం ఉంది. ఇటు చూస్తేనేమో ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు, దీనితో ఈ పదవులు ఎవరికీ ఇవ్వాలి అనే విషయం ఇప్పుడు కత్తిమీద సాముగా మారిపోయింది. ఇప్పటివరకు వచ్చిన పదవులను కీలకమైన నేతలకు కట్టబెట్టి, మిగిలిన వాళ్ళని బుజ్జగిస్తూ, రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 50 దాక నామినేటెట్ పదవులు రాబోతున్నాయి, వాటిలో మిగిలిన వాళ్ళకి అవకాశం ఇస్తామని చెపుతూ, పెద్దగా సమస్యలు రాకుండా హ్యాండిల్ చేస్తున్నారు అక్కడి నేతలు. విజయనగరం మీదున్న ప్రేమను జగన్ పదవులు ఇస్తూ చూపిస్తుంటే, వాటిని ఎలా పంచిపెట్టాలో తెలియక అక్కడి నేతలు ఇబ్బంది పడుతున్నారు