టీడీపీ లో బలమైన గొంతు ఎందుకు మూగబోయింది

Payyavula Kesav

  గతంలో టీడీపీ వాణి గట్టిగా వినిపించటంలో ముందుండే నాయకుడు పయ్యావుల కేశవ్. సందర్భానికి తగ్గట్లు తన వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకోవడంతో పాటుగా అవతలి పార్టీలను ఆత్మరక్షణ ధోరణిలో పడేసే నైపుణ్యం అయన సొంతం. అలాంటి నేత పార్టీ కష్టకాలంలో ఉంటే కనీసం కన్నెత్తి చూడటం లేదు. 

Payyavula Kesav

   చిన్న వయస్సులోనే రాజకీయ ప్రవేశం చేసి ఉరవకొండ నుండి ఆరుసార్లు పోటీచేసి నాలుగు సార్లు గెల్చి, రెండు సార్లు ఓడిపోయినా పయ్యావుల టీడీపీ పార్టీకి నేడు అంటీముట్టనట్లు వున్నాడు. దీనికి కారణం టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అని అంటున్నారు. 2004 లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరపరాజయం పాలైన సమయంలో పయ్యావుల కేశవ్ గెలిచి అసెంబ్లీ లో విప్ గా ఉండటమే కాకుండా వైఎస్సార్ కి వ్యతిరేకంగా గళం విప్పిన నేత, సభలో టీడీపీని ముందుండి నడిపిన ఘనత పయ్యావులది. ఆ తర్వాత 2009 లో అధికారంలోకి రాకపోయినా కానీ ఎమ్మెల్యే గా గెలిచి పార్టీ తరుపున పోరాటాలు చేసి గౌరవాన్ని కాపాడిన నేత.

  2014 లో పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ పయ్యావుల గెలవలేకపోయాడు.ఆయన గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రి పదవి వచ్చివుండేది అనే మాటలు గట్టిగా వినిపించాయి. అయితే చంద్రబాబు నాయుడు పయ్యావుల లాంటి నేతకు కేవలం ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇచ్చాడు. అధికారం వున్నా ఐదేళ్లు పయ్యావుల తనకి లోకేష్ మాదిరి మంత్రి పదవి వస్తుందేమో అనే ఆశతో ఎదురుచూశాడు. పార్టీ కోసం అంతగా కష్టపడిన పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి ఇవ్వటం పెద్ద కష్టమేమి కాదు, కానీ బాబు మాత్రం ఆ పని చేయకపోగా, పయ్యావులను పక్కన పెట్టినట్లు వ్యవహరించాడు.

   మొన్నటి 2019 ఎన్నికలో టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. జగన్ ప్రభంజనంలో సైతం పయ్యావుల గెలిచి నిలిచాడు. అయితే గతంలో మాదిరి ఈసారి పయ్యావుల పార్టీలో హుషారుగా లేడు . అధికారం ఉంటే పక్కన పెట్టటం, ప్రతిపక్షంలో ఉంటే వాడుకోవటం లాంటివి చేయటంతో పయ్యావుల మౌనంగా తన నియోజకవర్గానికి సంబంధించిన పనులు మాత్రమే చేసుకుంటూ సైలెంట్ అయ్యాడు.. పయ్యావుల లాంటి బలమైన నేత యొక్క అవసరం ప్రస్తుతం పార్టీకి చాలా అవసరం కానీ చంద్రబాబు చేసిన రాజకీయం వలనే పయ్యావుల సేవలు ప్రస్తుతం పార్టీ కోల్పోయిందని తెలుగు తమ్ముళ్లే వాపోతున్నారు