2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ముఖ్య కారణాల్లో జగన్ స్పీచ్ లు కూడా ఒకటి. అయితే అధికారంలో వచ్చిన తరువాత మాత్రం ఆయన మాట్లాడటం పూర్తిగా మానేశారు. ఇప్పటికి ఆయన అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తి కావొస్తున్నప్పటికి జగన్ మాత్రం కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత రమేష్ కుమార్ విషయంలో, కరోనా సమయంలో మాత్రమే ప్రెస్ మీట్స్ నిర్వహించారు. కానీ పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రం ఆయన ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు.
ఇంకెన్ని రోజులు ఈ మౌనం??
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వంపై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. కానీ వైఎస్ జగన్ మాత్రం ఒక్క విమర్శకు కూడా ఆయన సమాధానం ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు వస్తే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, మంత్రులు సమాధానాలు చెప్తున్నారు కానీ జగన్ మాత్రం మాట్లాడటం లేదు, ఏ విమర్శకు సమాధానం చెప్పడం లేదు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలకు చాలాసార్లు ఎదురుదెబ్బలు కూడా తగిలాయి కానీ అలాంటి సందర్భాలలో కూడా జగన్ స్పందించలేదు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. దీనిపైన కూడా జగన్ ఏమీ మాట్లాడ లేదు. ఇక రాజధాని అమరావతిలో రైతుల నిరసనలు 300 రోజులు దాటినా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. తిరుమల డిక్లరేషన్ విషయంలో ప్రతిపక్షాల నాయకులు అంత రచ్చ చేస్తున్నప్పటికీ జగన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మౌనం జగన్ ఎందుకు వహిస్తున్నారో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.
మౌనం వెనక ఉన్న కారణం ఏంటి??
ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ, ప్రభుత్వానికి కోర్ట్ ల నుండి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికి జగన్ మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. ఈ మౌనం వెనక ఉన్న కారణాలేంటో ఎవ్వరికి తెలియదు. కానీ ఇది కూడా ఒకరకమైన రాజకీయ వ్యూహమని రాజకీయ విశ్లేషకుల చెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నా, లేకున్నా ప్రెస్ మీట్స్ పెడుతూ, అక్కడ జగన్ ను వైసీపీ నాయకులను తిడుతూ ఉండేవారు అలా చెయ్యడం వల్లే ప్రజల్లో జగన్ పై సానుభూతి వచ్చింది కాబట్టి ఇప్పుడు జగన్ ఆ సానుభూతి చంద్రబాబు మీదకు రాకుండా ఉండేందుకే తాను ప్రతిపక్షాల మీద ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యడం లేదని చెప్తున్నారు. కానీ జగన్ మౌనం వల్ల పార్టీకి నష్టం జరిగిందని, పార్టీ యొక్క భావజాలం ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదని సొంత వైసీపీ నాయకులే భావిస్తున్నారు. జగన్ ప్రజా సమస్యలపై, తనపై వస్తున్న విమర్శలపై ఎప్పుడు నోరు విప్పుతాడో వేచి చూడాలి.