సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. కానీ, ఏం లాభం.? చీటికీ మాటికీ సంయమనం కోల్పోతున్నారు.. అంతేనా, జ్ఞానం కూడా కోల్పోతున్నారు. ఆయనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆ కారణంగా సంభవించిన వరదలపై న్యాయ విచారణ చేయాలనడం చంద్రబాబు మానసిక స్థితిని చెప్పకనే చెబుతోంది.
అనూహ్యంగా వచ్చిన వరదల వెనుక, ప్రభుత్వ అలసత్వం వుందన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ. నిజంగానే ప్రభుత్వం అంతలా అలసత్వం ప్రదర్శిస్తుందా.? అధికార యంత్రాంగం అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా.? అన్న విషయమై చంద్రబాబుకి కనీసపాటి అవగాహన లేకపోవడం శోచనీయం.
ఇలాంటి సందర్భాల్లో చాలా అరుదుగా మానవ తప్పిదం అనే అంశం తెరపైకొస్తుంటుంది. వరద సమస్య తీరాక.. అన్ని విషయాలపైనా మాట్లాడుకుంటే దాన్నెవరూ తప్పు పట్టరు. ఇంకా, ఆ వరద బాధిత ప్రాంతాలకు ముప్పు తొలగిపోలేదు. భారీ వర్షాలు కురుస్తూనే వున్నాయి. ఈ సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి, ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత హోదాలో విలువైన సూచనలు చేయాలి.
చట్ట సభలు సహా, పలు వేదికలు ఎప్పుడూ ప్రతిపక్షానికి వుంటాయి. ఆయా వేదికలపై ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నించే అవకాశం విపక్షాలకు వుంటుంది కదా.? చంద్రబాబుకి ఈమాత్రం తెలియదా.? ఎందుకీ తొందరపాటు.? ఎందుకీ అసహనం.?
న్యాయ విచారణ చేయాల్సి వస్తే.. గత ప్రభుత్వాల వైఫల్యం కూడా తెరపైకొస్తుంది. మరి, ఆ వైఫల్యానికి బాధ్యత పధ్నాలుగేళ్ళపాటు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తీసుకుంటారా.?