Chandrababu : ఇంతకీ అది గౌరవ సభా.? కౌరవ సభా.?

Chandrababu : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు హాజరు కావడంలేదు. ‘కౌరవ సభలోకి అడుగు పెట్టేది లేదు.. గౌరవ సభగా మారాక.. అంటే, తెలుగుదేశం పార్టీ గెలిచాక.. ముఖ్యమంత్రి హోదాలోనే సభకు గౌరవంగా వస్తాను..’ అని శపథం చేసేశారు చంద్రబాబు.

ఏది గౌరవ సభ.? ఏది కౌరవ సభ.? నిండు సభలో వైసీపీ ఎమ్మెల్యే రోజాని అవమానించినప్పుడు దాన్ని కౌరవ సభ అనాలా.? గౌరవ సభ అనాలా.? అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు, దాన్ని మాత్రం ‘గౌరవ సభ’గానే భావించారు.

సరే, చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదాలో అధికార వైసీపీని అసెంబ్లీలో ఎదుర్కోవడం చేత కావడంలేదు గనుక, ఆయన సభకు డుమ్మా కొట్టేస్తున్నారు.. అది వేరే సంగతి. కానీ, ‘కౌరవ సభ’ అంటూనే, ఆ కౌరవ సభకి టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు పంపించడమేంటో.. ఇందులో లాజిక్కేమిటో ఆయనకే తెలియాలి.

కోవిడ్ నేపథ్యంలో అనేక ఆంక్షల నడుమ గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు పెద్దగా లేవు. సభ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిర్వహించుకునేలా ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఒత్తిడి తీసుకురావడానికి వీలుంది.

రాజధాని అమరావతి సహా చాలా విషయాల్లో ప్రభుత్వానికి నిలదీసేందుకు ప్రతిపక్షానికి అవకాశం దొరుకుతోంది కూడా. అయినాగానీ, సభకు చంద్రబాబు డుమ్మా కొట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని చేతకానితనం.. అని అనాలేమో.!