పెట్రో మంట: ప్రధాని మోడీపై విమర్శల విషయంలో చంద్రబాబు మౌనమేల.?

2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో ఎలాగైనా జతకట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, పెట్రో ధరల విషయమై కేంద్రాన్ని ప్రశ్నించకుండా, రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రబాబు అండ్ టీమ్ విమర్శల దాడి చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడైతే, తన స్థాయిని తగ్గించుకుని మరీ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా పెట్రో ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపైన. నిజానికి, పెట్రో ధరల అంశం కేంద్రం పరిధిలో వుంది. కేంద్రమే అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రో ధరల్ని పెంచుకుంటూ పోతోంది. నిజానికి, అంతర్జాతీయ చమురు ధరలతో సంబంధం లేకుండా దేశంలో పెట్రో ధరలున్నాయి.

కేంద్రం బాదుతోన్న పన్నులు, రాష్ట్రాలు బాదుతున్న పన్నులు వెరసి.. పెట్రో మంట మండుతోంది దేశంలో. పెట్రోల్, డీజిల్.. భవిష్యత్తులో భారతదేశంలో దొరకడమే గగనమైపోవచ్చు. లీటర్ వెయ్యి రూపాయల దాకా ఈ ధరలు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదేమో. ఎందుకంటే, పాలకులు పెట్రోల్ మరియు డీజిల్ ధరల మీద అంత అత్యాశ ప్రదర్శిస్తున్నారు. ‘అబ్బే, మాకేం సంబంధం లేదు.. చమురు కంపెనీలు పెంచుతున్నాయ్..’ అని కేంద్రం చేతులు దులుపుకోవడం మరింత పెద్ద కామెడీ ఇది. నిజానికి, దేశవ్యాప్తంగా రాజకీయాల్లో తాను చక్రం తిప్పేశానని చెప్పుకుంటోన్న చంద్రబాబు, జాతీయ స్థాయిలో బీజేపీయేతర రాజకీయ పార్టీల్ని ఏకం చేయగలిగి, పెట్రో ధరలపై పోరాడగలిగితే.. ఆయనకీ పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది. కానీ, మోడీని ఎదిరిస్తే ఏమవుతుందో చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే, మిన్నకుండిపోతున్నారన్నమాట.