చిత్తశుద్ది కేరాఫ్ చంద్రబాబు – చెత్త శుద్దిగా మారిపోయిందే ! 

చిత్తశుద్ది కేరాఫ్ చంద్రబాబు - చెత్త శుద్దిగా మారిపోయిందే !
వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని పట్టుబడితే కేసీఆర్ మాత్రం అడ్డుకుని తీరుతాం అంటున్నారు.  ఈ వివాదం పట్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి పట్టుదలతో వారు ఉన్నారు.  కృష్ణా జలాల్లో తమకున్న వాటా ప్రకారమే ప్రాజెక్టు కట్టుకుంటే తప్పేమిటని జగన్ ప్రభుత్వం అంటుంటే తెలంగాణలో, ఏపీలో కొత్త నీటి పారుదల ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే అపెక్స్‌ కమిటీ అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం చెబుతోందని, కానీ ఏపీ సర్కార్ అపెక్స్‌ కమిటీ ఆమోదం తీసుకోకుండానే జీవో రిలీజ్ చేశారని, ఈ ప్రాజెక్ట్ వలన ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుందని కాబట్టి దీన్ని అడ్డుకుని తీరుతామని తీర్మానం చేసుకున్నారు.  
 
ఈ పోరాటంలో తెలంగాణ వైపు నుండే గట్టి వాదనలు వినిపిస్తున్నాయి.  కారణం అక్కడ తెరాసతో పాటు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు సైతం రాయలసీమ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  అసలు కేసీఆర్ ఏపీతో మంచి స్నేహం ఉన్నా కూడా ఇంత గట్టిగా నిలబడటానికి కారణం వారి ఒత్తిడే.  వారే కేసీఆర్ తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అంటూ అడ్డుకునేలా రెచ్చగొట్టారు.  కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.  ప్రధాన ప్రతిపక్షం రాయలసీమ ఎత్తిపోతల మీద కనీసం తమ స్పందన ఏమిటో కూడా చెప్పలేదు.  వారి ద్రుష్టిలో ప్రాజెక్ట్ సక్రమం అయితే వైఎస్ జగన్ వైపు నిలిచి తెరాసతో పోట్లాడాలి.  ఒకవేళ సక్రమం కాకపోతే అయ్యా.. జగన్ అది నీటి వాటాలకు విరుద్దంగా ఉందని వివరించి ఆగమని చెప్పాలి. 
 
కానీ చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇవ్వట్లేదు.  ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం అమరావతి మీదే ఉంది.  తాను కలలు కన్న నగరం ఎక్కడ ఆగిపోతుందో తనవి, తనను నమ్ముకున్న వారి ప్రయోజనాలు నీరుగారకుండా ఉండాలని పోరాటం చేస్తున్నారు.  అందుకే ఆయనకు రాయలసీమ బాగు మీద దృష్టి పెట్టే సమయం లేకపోయింది అనిపిస్తోంది.  అమరావతి మీదున్న చిత్తశుద్ది తన మూలాలున్న రాయలసీమకు నీళ్లు రావడం మీద లోపించింది.  మరోవైపు కొందరు బాబుగారి చిత్తశుద్ధి నశించలేదని అది కాస్త చెత్త శుద్దిగా మార్పు చెందిదని అంటున్నారు.  ఎందుకంటే బాబుగారు ఈ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ ప్రతిపక్ష నేతలను కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చేలా చేస్తున్నారని అంటున్నారు.  ప్రాజెక్ట్ పూర్తైతే జగన్ కు మంచి పేరు వస్తుంది.  అలా రావడం ఇష్టంలేకనే బాబుగారు ఈ కుట్ర చేస్తున్నారని అంటున్నారు.  ఈ ఆరోపణలే నిజమైతే బాబుగారు సీమకు ద్రోహం చేసినట్టే.