Bhogi 2022 : సంక్రాంతి అంటే అచ్చ తెలుగు పండగ. కొత్త అల్లుళ్లతో, సంక్రాంతి ముగ్గులతో ప్రతి పల్లె అందంగా ముస్తాబవుతుంది. పిండివంటలతో ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతుంది. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారంతా తమ సొంత ఊర్లకు తప్పకుండా వెళ్తారు. సంక్రాంతి ముందు వచ్చే భోగి చాలా ప్రత్యేకతలు కూడుకున్నది. భగ అనే పదం నుంచి భోగి వచ్చింది అంటారు పెద్దలు. అయితే దక్షిణాయనానికి చివరి రోజు భోగి అని అంటారు పెద్దలు.
దక్షిణాయనంలో మనం పడ్డ కష్టాలు బాధలు భోగి మంటల రూపంలో అగ్ని దేవునికి సమర్పించి ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను సాధించాలనే ఉద్దేశ్యమనే భోగి. ఒక్క సంక్రాంతికి ముందు వచ్చే రోజునే భోగి అని అనం… . శివరాత్రి ముందురోజు శివభోగి, నరక చతుర్థశి మందురోజు దీపావళి భోగి, మహర్నవమి దసరా భోగి…ఇలా ప్రతి పండుగకు ముందు రోజుని భోగి అనే అంటారు. అన్నటికన్నా ధనుర్మాసం ఆఖరి రోజు వచ్చే భోగి అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టం. నెలరోజుల పాటూ గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతాన్ని మెచ్చి స్వయంగా రంగనాథుడే దివినుంచి భువికి దిగివచ్చిన రోజు. అందుకే భోగి రోజు పొద్దున్నే ఆవుపేడతో లోగిళ్లలో కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు, అందులో గొబ్బెమ్మలతో అలంకరిస్తారు.
భోగి మంటలు గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. కర్రలు, పిడకలతో భోగి మంటలను ఏర్పాటు చేస్తారు. ఇంట్లో ఉన్న పాత వస్తువును భోగి మంటల్లో వేసి కాలుస్తారు. మనలో ఉన్న చెడును కూడా ఇలా కాల్చేయాలనేదే భోగి మంటల సారాంశం. దీంతో పాటు భోగి రోజు శీతాకాలం చాలా చలిగా ఉంటుంది. క్రిమికీటకాలు కూడా ఎక్కవ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నింటికి భోగి మంటలే పరిష్కారం. దీంతో పాటు సంక్రాంతి రోజున వరకు పంట ఇళ్లకు చేరుతుంది. పంటల నుంచి వచ్చే క్రిమి కీటకాలను కూడా ఇళ్లలోకి రాకుండా భోగి మంటలు కాపాడుతాయి.
ఇక పల్లెల్లో భోగి పళ్ల కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. చిన్నారులు భోగి పళ్లు పోస్తారు. దీనికి కూడా ఓ కారణం ఉంది. రేగి పళ్లు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపం. ఇది సూర్యుడికి కూడా ఇష్టమైన ఫలం. రేగుపళ్లతో పాటు నాణేలు కలిపి చిన్నారుల తలపై పోస్తే.. ఆ లక్ష్మీ నారాయణుల కటాక్షం ఉంటుంది. పిల్లలపై ఉన్న నరద్రిష్టి తొలిగిపోయి.. వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని పెద్దల విశ్వాసం. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై పిల్లలు జ్ఞానవంతులు అవుతారని కూడా చెబుతారు. ఎందుకంటే రేగు పండ్లు సూర్య కిరణాల్లో ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి. అందుకే రేగుపళ్లు తలపై పోయడం వలన వీటిలో విద్యుశ్చక్తి ఆరోగ్యాన్నిస్తుందని అంటారు.