ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గ్రేటర్ ఎన్నికల హడావుడే. అసలు.. గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ ఓడుతుంది. మళ్లీ బీజేపీకే ప్రజలు పట్టం కడతారా? లేక అధికార పార్టీని గెలిపిస్తారా? లేక కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తారా? ఎంఐఎంకు ఈసారి ఎన్నిసీట్లు వస్తాయి. ఇలా వంద రకాల సందేహాలు తొలుస్తున్నాయి.
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా మేనిఫెస్టోను విడుదల చేస్తుంది. కానీ.. ఈ సారి విచిత్రంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేశాయి. మమ్మల్ని గెలిపించండి.. మేము ఇది చేస్తాం.. అది చేస్తాం.. అంటూ ప్రజలను ఊరడిస్తున్నాయి.
మేనిఫెస్టోతో గ్రేటర్ ప్రజలను ఆకర్షించాలని పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ప్రచారం కూడా మామూలుగా జరగడం లేదు. ఓ రేంజ్ లో జరుగుతోంది. నువ్వా..నేనా? అన్నట్టుగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి.
బీజీపీ దూకుడు అయితే మామూలుగా లేదు. గల్లీ ఓట్ల కోసం ఢిల్లీ నుంచి నేతలు దిగుతున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, యూపీ సీఎం.. ఇలా ఢిల్లీ లీడర్లు హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓవైపు ప్రచారం నిర్వహిస్తూ… మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం గుప్పిస్తోంది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకొని ప్రచారం చేస్తోంది.
మరోవైపు సీఎం కేసీఆర్ కూడా గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. దుబ్బాక ఓటమి ఇక్కడ రిపీట్ కాకుండా ఉండటం కోసం… తానే స్వయంగా రంగంలోకి దిగారు. హైదరాబాద్ ప్రజలకు వరాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. వరద బాధితులకు మళ్లీ డిసెంబర్ 7 నుంచి సాయం అందిస్తామని ప్రకటించారు. ఉచిత మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే ప్రచారం చేస్తోంది. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసి దూకుడు మీదుంది. రేవంత్ రెడ్డి కూడా అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చూస్తూ.. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఎంఐఎం కూడా ఈసారి గట్టిగానే ప్రచారం చేస్తోంది. 50 సీట్లు గెలవాలన్న కసితో ఉంది.
అయితే.. ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరిది గెలుపు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. గెలుపు గుర్రం ఎవరు ఎక్కుతారు అనేదానిపై క్లారిటీ రావాలంటే మాత్రం డిసెంబర్ 4 దాకా ఆగాల్సిందే.