2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీతో పోటీ పడేదెవరు.?

Who Will Fight With Modi In 2024 Elections?

Who Will Fight With Modi In 2024 Elections?

దేశంలో ప్రస్తుతానికి ఒకే ఒక్క అత్యంత సమర్థుడైన నాయకుడున్నాడన్నది బీజేపీ వాదన. ఆ సమర్థుడు ఇంకెవరో కాదు ప్రధాని నరేంద్ర మోడీ అని కమల నాథులు విశ్వసిస్తున్నారు. సరే, అంత సమర్థతే వుంటే.. దేశంలో కరోనా ఇంత దారుణంగా వ్యాప్తి చెందేదే కాదు.. ఇన్ని వేల మంది, లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారే కాదు.

సరే, కరోనా ప్రపంచం మొత్తాన్నీ వణికిస్తోందనుకోండి.. అది వేరే సంగతి. దేశంలో ఆర్థిక పరిస్థితులు సహా.. అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే, గడచిన ఏడేళ్ళలో మోడీ సర్కార్, దేశాన్ని అదనంగా ఉద్ధరించిందేమీ లేదు సరికదా, దేశాన్ని అప్పుల్లోకి నెట్టేసిందన్న విమర్శలున్నాయి.

ఇంతకీ, 2024 ఎన్నికల్లో మోడీకి ధీటుగా నిలబడే నాయకత్వం ఎవరు తీసుకుంటారు.? ఈ ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం వెతకడం కష్టమే. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా రాహుల్ గాంధీనే, మోడీకి ధీటైన ప్రత్యర్థి. అయితే, రాహుల్ గాంధీ అంత సీరియస్ టోన్ ప్రదర్శించడంలేదు.. నరేంద్ర మోడీని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో.

కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు తీసుకునే క్రమంలోనే ‘పిల్ల చేష్టలు’ రాహుల్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక, ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, బీజేపీని ఎదుర్కొని నిలబడ్డ వైనం తర్వాత.. దేశంలోనూ మోడీకి ఆమెనే సరైన ప్రత్యర్థి అన్న ప్రచారం జరుగుతోంది.

గతంలో అరవింద్ కేజ్రీవాల్ విషయమై ఇదే తరహా ప్రచారం జరిగింది. నిజానికి, దేశానికి సమర్థవంతమైన నాయకత్వం.. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఇంకా ఎక్కువమంది వున్నప్పుడే.. పోటీ రంజుగా వుంటుంది.. అధికారంలో ఎవరున్నా మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు.

కానీ, ఆ పరిస్థితి దేశంలో లేదు. ఫెడరల్ ఫ్రంట్.. అంటూ హంగామా చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ కూడా టైమ్ పాస్ రాజకీయాలు చేస్తుంటారు.. జాతీయ రాజకీయాల ప్రస్తావన వస్తే. ప్రత్యర్థి వర్గం ఎంత బలహీనంగా వుంటే.. నరేంద్ర మోడీ నాయకత్వానికి అంత బలం మరి.