బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా చెప్పులెవరు మోస్తారబ్బా.?

బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆసక్తికరమైన కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొన్నీమధ్యనే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణఖు వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. అమిత్ షా చెప్పుల్ని అందించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయమై పెను రాజకీయ దుమారం చెలరేగింది.

దానికి సంబంధించిన కార్టూన్‌ని ట్వీట్ చేస్తూ, ‘ఈసారి ఎవరు ఆ బాధ్యత (చెప్పులు మోసే బాధ్యత) తీసుకుంటారు.?’ అంటూ తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. గులాబీ శ్రేణులు ఈ కార్టూన్‌ని వైరల్ చేస్తున్నాయి.

పెద్దలకు గౌరవభావంతో పాద నమస్కారం చేయడం, అవసరమైతే వాళ్ళకు చెప్పులు తొగడం.. ఇవన్నీ మామూలే. రాజకీయాల్లో ఇలాంటివి ఇంకాస్త ఎక్కువ వుంటాయి. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి సాష్టాంగ నమస్కారం కేసీయార్ చేశారంటూ అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ‘తెలంగాణ కోసం గొంగలిపురుగునైనా ముద్దాడతా..’ అంటూ కేసీయార్ గతంలో చెప్పిన విషయాన్ని, అవసరమొచ్చినప్పుడల్లా వాడేస్తుంటుంది టీఆర్ఎస్.

ఓ ఎంపీ, ఇంకో ఎంపీ చెప్పులు మోయడమేంటి.? అని బండి సంజయ్ – అమిత్ సా చెప్పుల వ్యవహారానికి సంబంధించి ప్రశ్న తెరపైకి రావడం సహజమే. ఇందులో తెలంగాణ ఆత్మగౌరవ అంశం కూడా ముడిపడి వుంది. కానీ, ఇప్పుడు ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది తెలంగాణ రాష్ట్ర సమితి.

ప్రతిసారీ చెప్పులు మోసే పరిస్థితి వుంటుందా.? ఒక్కసారి ఏదో పొరపాటు జరిగితే, దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారా.?
కలెక్టర్లతో గులాబీ నేతలు కాళ్ళు మొక్కించుకున్నప్పుడు, తమకు అవసరమైనప్పుడు ‘పెద్దలు’ పేరు చెప్పి పలువురు ప్రముఖుల కాళ్ళను కేసీయార్ మొక్కినప్పుడు.. ఏమయ్యిందీ ఆత్మగౌరవం.? అన్న ప్రశ్న పుట్టుకొస్తోంది.