Undavalli Questions : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనపై ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన అంశాల్ని తెరపైకి తెస్తుంటారు. అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని రెండుగా విభజించిన కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీగా పని చేశారు. అయితే, విభజనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మేం రాష్ట్రాన్ని విడిపోనివ్వం..’ అని ఖరాఖండీగా చెప్పిన బ్యాచ్‌లో ఆయన కూడా వున్నారు.
విభజన తప్పదని తెలిసి, అప్పట్లో ఏపీ కాంగ్రెస్ ఎంపీల్లో చాలామంది తమ పదవులకు రాజీనామా చేశారు కూడా. నిజానికి, ఆ రాజీనామాలు అప్పట్లో చెల్లి వుంటే, విభజన బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యేదే కాదు. విభజన అశాస్త్రీయం, అన్యాయం, చట్ట విరుద్ధమంటూ ఉండవల్లి కోర్టును ఆశ్రయించారు కూడా.
ఎనిమిదేళ్ళవుతున్నా, ఆనాటి ఆ కేసు విషయమై ఇప్పటికీ ఎటూ తేలలేదు. విభజన వ్యవహారంపై చట్ట సభల్లో చర్చ జరగాలంటూ పదే పదే ఉండవల్లి చెబుతుంటారు. రాష్ట్ర సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వంగానీ, వైఎస్ జగన్ ప్రభుత్వంగానీ, కేంద్రాన్ని న్యాయస్థానాల సాక్షిగా ప్రశ్నించడంలేదన్నది ఉండవల్లి వాదన.
అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్.. ఇంకో పక్క పవన్ కళ్యాణ్.. ఇలా అందరూ నరేంద్ర మోడీకి భయపడుతుండడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఉండవల్లి చెబుతున్నారు. తాను వేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా జాయిన్ అయితే, రాష్ట్రానికి న్యాయం జరిగి తీరుతుందన్నది ఉండవల్లి వాదన.
అయితే, ఉండవల్లి ఎప్పటికప్పుడు మీడియా ముందుకొచ్చి చేసే వ్యాఖ్యలు, విమర్శలు ఉత్త ప్రసంగాలుగానే మిగిలిపోతున్నాయి. చంద్రబాబుని ఉండవల్లి విమర్శిస్తే, వైసీపీ పండగ చేసుకుంటుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉండవల్లి విమర్శిస్తే, టీడీపీ పండగ చేసుకుంటుంది. అంతే తప్ప, ఉండవల్లి ప్రశ్నలకు అటు చంద్రబాబుగానీ, ఇటు జగన్ గానీ.. సమాధానం చెప్పాలన్న ఆలోచనే చేయరు.