Omicron: ప్రపంచ మానవాళిని ఇప్పటికే రెండు సార్లు ఒక ఆటాడేసుకున్న కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసిరేందుకు రెడీ అయిపొయింది. గత రెండు పర్యాయాలలో కరోనా కొట్టిన దెబ్బకు అతలాకుతలం అయిన జనం మూడో వేవ్ వస్తుందోన్న భయంతో గజగజలాడుతున్నారు. మహమ్మారి తన స్వభావం, ప్రభావం మార్చుకుని ఎప్పటికప్పుడు బలంగా విజృంభిస్తుంది.
కొత్త కోవిడ్ వేరియంట్ ఓమిక్రాన్, అత్యంత వేగంగా ప్రసరిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటివరకు కనీసం 59 దేశాలకు వ్యాపించిందని సమాచారం. భారతదేశంలో, కొత్త వేరియంట్ మూడవ వేవ్ పై ఆందోళన రేకెత్తిస్తున్నందున, WHO ఆగ్నేయాసియా డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కీలకాంశాలను ప్రస్తావించారు. ” ఈ కొత్త వేరియంట్ వలన పరిస్థితులు గతం కంటే మరింత అద్వానంగా ఉండబోవని , కానీ ఖచ్చితంగా కొంతమేర ఇబ్బందులు ఉంటాయని” హెచ్చరించారు.
“మహమ్మారి ఇంకా పొంచి ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న ఓమిక్రాన్ వ్యాప్తి మరియు కొత్త వైవిధ్యాల ఆవిర్భావం దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా COVID-19 ప్రమాదం ఎక్కువగా ఉందని” ఆమె వివరించారు. దక్షిణాసియా ప్రాంతంలో మరింత అప్రమత్తంగా నిఘా, ప్రజారోగ్యం మరియు సామాజిక చర్యలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. టీకా కవరేజీని వేగంగా పెంచాలి అని పేర్కొన్నారు.
ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం కొంచెం కష్టం. స్పష్టమైన అవగాహన రూపొందించడానికి మరింత డేటాను సమర్పించాలని WHO అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఓమిక్రాన్ తీవ్రత, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. భారతదేశంలో ఇప్పటివరకు ఐదు రాష్ట్రాలలో 33 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి . మాస్క్‌ల వాడకాన్ని నివారించడం మరియు వ్యాక్సినేషన్‌లో జాప్యం చేయడం వంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం హెచ్చరించింది.