తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికల సమరం మొదలుకాబోతుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో అందరి చూపు ప్రధాన పార్టీలైన తెరాస,కాంగ్రెస్, బీజేపీల వైపు పడింది. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు పెట్టుబడిగా భావిస్తున్నాయి.
తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలని తెరాస భావిస్తుంటే, ఈ స్థానంలో విజయం సాధించి దుబ్బాక గెలుపు, గ్రేటర్ లో ఇచ్చిన పోటీ కేవలం నామమాత్రమే కాదని నిరూపించాలని బీజేపీ బలంగా భావిస్తుంది. మరోపక్క తమ పని అయిపోయిందని భావిస్తున్న వాళ్లందరికీ సాగర్ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి రేసులోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనితో సాగర్ లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది.
సాగర్ ఎన్నికల్లో ఇప్పటికే కాంగ్రెస్ తరుపున సీనియర్ నేత జానారెడ్డి ఫైనల్ అయ్యాడు. ఆయన్ని ఢీకొట్టి గెలవగలిగే సరైన అభ్యర్థుల కోసం బీజేపీ మరియు తెరాస పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. నాగార్జున సాగర్ అంటే ఒక రకంగా జానారెడ్డికి కంచుకోట అనే చెప్పాలి. గత ఎన్నికల్లో గెలిచినంత పనిచేసాడు జానారెడ్డి, కాబట్టి ఈ ధపా ఆయన్ని ఓడించటానికి సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.
బీజేపీ పార్టీ ముందుగానే ఇక్కడ పావులు కదిపి జానారెడ్డిని తమ వైపు తిప్పుకోవాలని గట్టి ప్రయత్నాలే చేసింది, కానీ అవేమి ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో నాగార్జునసాగర్‌లో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రదేశంలో ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీజేపీ ముఖ్యనేతలను కలిశారని, నాగార్జున సాగర్ టికెట్ హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిన్నపరెడ్డి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు తెలుస్తోంది.
మరోపక్క తెరాస కూడా సరైన అబ్యర్థి కోసం గాలిస్తుంది. దుబ్బాక లో చేసినట్లు చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పోటీకి దించితే ఫలితం ఎలా వస్తుందో అనే భయం కూడా తెరాస కు పట్టుకుంది. దీనితో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక ఇక్కడి అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది. ఒక వేళా తెరాస తరుపున సుఖేందర్ రెడ్డి పోటీకి దిగితే చిన్నపరెడ్డి బీజేపీ లోకి చేరి పోటీకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.