జగన్ మంత్రి వర్గంలో కొలువు దీరిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపీదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవ్వడంతో ఇప్పుడా రెండు పదవులు జగన్ ఎవరికి కట్టబెడతారు? అన్నదానిపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్నటి తో రాజ్యసభ ఎన్నికల ఘట్టం కూడా ముగిసిపోయింది. దీంతో రెవెన్యూ శాఖ, మార్కెటింగ్ శాఖ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు? అన్న సస్పెన్స్ పార్టీ సహా ప్రజల్లో నెలకొంది. ఇరువురు బీసీ సామాజిక వర్గం నుంచి ఎపికైన మంత్రులు కావడంతో మళ్లీ అదే వర్గానికి జగన్ పట్టం కడతారా? లేక కొత్త వారిని రంగంలోకి దించుతారా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
వైకాపా నుంచి ఆశావహుల జాబితా కూడా పెద్దగానే ఉంది. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారితో పాటూ జూనియర్లు కూడా బెర్తులపై ఆశలు పెట్టుకున్నారు. జగన్ సామాజిక వర్గం, జిల్లాల వారిగా లెక్కలేసి తీసుకుంటారా? సీనియర్లనే బరిలోకి దించుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురి నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. మోపీదేవి గుంటూరు జిల్లా వ్యక్తి. దీంతో అదే జిల్లాకు చెందిన మంగళగిర ఎమ్మెల్యే రామకృష్ణతో పాటు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ ఉన్నారు. రజనీ బీసీ కోటాలో పదవి పై ఆశ పెట్టుకున్నట్లు వినిపిస్తోంది. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ ఆర్కేకు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు. కానీ సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో పదవి దక్కలేదు.
అటుపై నామినేటెడ్ పదవిలోనూ ఆర్కే పేరు వినిపించలేదు. అయినా ఆర్కే మాత్రం పార్టీ లో యాక్టిక్ గా కొనసాగుతున్నారు. ప్రతిపపక్షాల విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ సత్తా చాటుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆళ్ల ఆశలు పెట్టుకున్నట్లే వినిపిస్తోంది. అయితే సామాజిక వర్గం ప్రాతిపదికన కేటాయింపులు జరిగితే ఆళ్లకు నిరాశ తప్పదు. ఇంకా అదే జిల్లా నుంచి సీనియర్ నేతలైన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి, అంబటి రాంబాబు పేర్లు కూడా రేసులో ఉన్నాయి.
ఇక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈయన మార్కెటింగ్, డిప్యూటీ సీఎంగా కూడా చేసారు కాబట్టి కేటాయింపు అనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. జిల్లా ప్రాతిపదికన కాకుండా సీనియర్ నేతని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ధర్మానప్రసాదరావు, కొలుసు పార్థసారధి, రోజా, తో పాటూ మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ సామాజిక వర్గం పక్కనబెడితే రోజాకి పదవి దక్కే అవకాశం ఉందని వినిపిస్తోంది. జగన్ సీఎం అవ్వగానే మంత్రి వర్గం ఏర్పాటు చేయగానే ఇక్కడ పదవులు శాశ్వతం కాదని ముందే చెప్పారు. రెండున్నరేళ్లు మాత్రమే పదవులుంటాయి. తర్వాత మార్పులు..చేర్పులు జరుగుతాయన్నారు. మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఎలాంటి స్ర్టాటజీతో ముందుకు వెళ్తారో చూద్దాం.