అన్నం.. చాలా మంది అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. కొందరు అప్పుడప్పుడు అన్నాన్ని తింటే.. మరికొందరు అయితే అన్నాన్నే ఎక్కువగా తింటుంటారు. ప్రపంచవ్యాప్తంగా బియ్యాన్ని పండిస్తున్నప్పటికీ.. అన్నాన్ని ఎక్కువగా తినరు. తరుచుగా మాత్రమే కొన్ని దేశాల్లో అన్నాన్ని తింటారు. లేదంటే కొద్దిగా మాత్రమే అన్నం తింటారు.
ఇక మన విషయానికి వస్తే.. మన దేశంలో ఎక్కువగా పండించేది బియ్యమే. మన దేశంలో ఎక్కువ శాతం అన్నమే తినడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా అన్నానికే ప్రాధాన్యత. రోజూ మూడు పూటలా అన్నం లేనిదే ముద్ద దిగదు.
అయితే.. నిజంగా అన్నం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఏ బియ్యం మంచివి.. ఏ బియ్యం మంచివి కావు.. అనే విషయం చాలామందికి తెలియదు.
కొందరైతే అన్నం తినాలి కాబట్టి తింటారు.. అంతే కానీ అవి ఏ బియ్యం అనేది చూడరు. అయితే.. అసలు ఏ బియ్యం తినాలి.. ఏ బియ్యం తినకూడదు.. అసలు నిజంగా అన్నం తింటే మంచిదేనా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
మనకు ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమయ్యే బియ్యాలు రెండు రకాలు. ఒకటి పాలిష్ బియ్యం.. ఇంకోటి పాలిష్ పట్టని బియ్యం.. వాటినే దంపుడు బియ్యం అంటారు.
నూటికి తొంబై మంది తినేది పాలిష్ చేసిన బియ్యాన్నే. దంపుడు బియ్యాన్ని చాలా తక్కువమంది తింటారు. దంపుడు బియ్యాన్నే ముడి బియ్యం అని కూడా అంటారు. ఆ బియ్యాన్ని ఎక్కువ మంది తినరు. ఎందుకంటే పాలిష్ బియ్యం రుచిగా ఉంటాయి. ముడి బియ్యం రుచిగా ఉండవు.
కానీ.. ముడి బియ్యం మాత్రమే ఆరోగ్యానికి మంచివి. 100 గ్రాముల ముడి బియ్యంలో 1.8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అదే పాలిష్ చేసిన బియ్యం తీసుకుంటే.. 100 గ్రాముల్లో 0.4 శాతమే ఫైబర్ ఉంటుంది.
పాలిష్ చేసిన బియ్యాన్ని అలాగే రోజూ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీంతో పోషకాహార లోపాలు వచ్చే ప్రమాదం ఉంది.
ముడి బియ్యం ఎక్కువ తిన్నా సమస్యే
అయితే.. పాలిష్ చేసిన బియ్యం కంటే ముడి బియ్యం మేలు.. కానీ.. ముడి బియ్యాన్న కూడా ఎక్కువగా తినొద్దు. ఎందుకంటే ముడి బియ్యంలో యాంటీ నూట్రియెంట్స్, ఫైటిక్ యాసిడ్, ఆర్సెనిక్స్ లాంటి విష రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే శక్తి తగ్గుతుంది. అందుకే… ముడి బియ్యాన్ని మితంగా తినాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మితంగా తీసుకుంటే ముడి బియ్యం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.