పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళి వుంటే ఏమయ్యేది.?

నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు.. అసెంబ్లీకి వెళుతున్నారు. ఆయన అసెంబ్లీకి వెళ్ళినా, ఒకటే వెళ్ళకున్నా ఒకటే. అసెంబ్లీకి ఆయన హాజరు కాకపోయినా, టీడీపీ కోటాలో ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేసేస్తున్నారు. ఇదీ రాజకీయం. రాజకీయం అంటేనే ఇలా వుంటుంది.!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. అసెంబ్లీకి హాజరైతే, ఆయన మీద అధికార పక్షం మాటల దాడి చేస్తోంది. ఈ క్రమంలో ఆయన కంటతడి పెడుతూ, అసెంబ్లీకి గుడ్ బై చెప్పేశారు తాత్కాలికంగా. ‘మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాకే గౌరవ సభకు వస్తా.. అప్పటిదాకా ఈ కౌరవ సభకు వచ్చేది లేదు..’ అనేశారు చంద్రబాబు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక 2019 ఎన్నికల్లో గెలిచి, అసెంబ్లీకి వెళ్ళి వుంటే.? చంద్రబాబు కంటే దారుణంగా గుక్క తిప్పుకోలేకుండా ఏడుస్తారా.? నందమూరి బాలకృష్ణలా సభలో వుండీ లేనట్లు వ్యవహరిస్తారా.? సోషల్ మీడియా వేదికగా ఈ విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అసెంబ్లీ అంటే అది అధికార పక్షం కనుసన్నల్లోనే నడుస్తుంది. రాష్ట్రాల అసెంబ్లీల నుంచి, దేశ పార్లమెంటు దాకా.. ఇదే పరిస్థితి. అధికార పక్షంలో వుంటేనే మాట్లాడేందుకు వీలుంటుంది. ప్రతిపక్షంలో వుంటే గొంతు నొక్కేయడమే. గతంలో చంద్రబాబు హయాంలో అదే జరిగింది.. ఇప్పుడు వైసీపీ హయాంలోనూ అదే జరుగుతోంది.

‘నేనే గనుక అసెంబ్లీకి వెళ్ళి వుంటే..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దీర్ఘం తీశారుగానీ, చట్ట సభలు ఎలా నడుస్తున్నాయో ఆయనకు తెలియదా.? మాట్లాడే అవకాశం తనకు దక్కుతుందని ఆయన ఎలా అనుకుంటున్నారు.?

ప్రస్తుత ప్రజా స్వామ్యంలో వుంటే.. అధికారంలో వుండాలి.. లేదంటే, గెలిచినా చట్ట సభలకు దూరంగా వుండాలి. ఇదీ ట్రెండ్. గతంలో వైసీపీ అధినేత చేసిందదనే, ఇప్పుడు టీడీపీ అధినేత చేస్తున్నదదే. రేప్పొద్దున్న ప్రతిపక్షంగా జనసేన వున్నా.. అప్పుడు పవన్ కళ్యాణ్ చేసేది కూడా అదే. అంతకు మించి చేయడానికేమీ లేదు.