Suicide: ప్రాణ స్నేహితులు ఆత్మహత్యకు గల కారణం ఏంటి? కడప బస్టాండ్ లో చివరి సెల్ఫి..!

Suicide: అనంతపురం జిల్లా యాడికి మండలానికి చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితుల ఆత్మహత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇద్దరు ప్రాణాలు తీసుకోవడం వెనుక గల మిస్టరీ ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. సోమవారం వీరిద్దరూ కడప జిల్లాలో రైలు పట్టాల మీద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాడికి మండలం హాస్పిటల్ కాలనీ లో నివాసం ఉంటున్న పూజిత (18) బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. కళ్యాణి యాడికి మండలం లోని కమలపాడు గ్రామం లో నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి గుత్తి లోని గేట్స్ కాలేజీలో బీటెక్ చేస్తోంది. వీరిద్దరూ వేములపాడు మోడల్ స్కూల్లో ఇంటర్ వరకు కలసి చదువుకున్నారు. సోమవారం ఉదయం కళ్యాణి విద్యా దీవెన పథకానికి సంబంధించిన పని నిమిత్తం సొంత ఊరైన కమలపాడు సచివాలయానికి వెళుతున్నట్టు చెప్పి బయలుదేరింది.

పూజిత కాలేజీ కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరింది. వీరిద్దరూ కలిసి సోమవారం ఉదయం తాడిపత్రి బస్ స్టాండ్ లో కడప బస్సు ఎక్కి కడపకు బయలుదేరారు. కడప బస్టాండ్లో దిగిన తర్వాత అక్కడ ఇద్దరూ కలిసి ఒక సెల్ఫీ తీసుకొని కడప రైల్వే స్టేషన్ కు ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం 1.30 సమయంలో కడప రైల్వే స్టేషన్ లో అటూ ఇటూ తిరిగినట్టు సిసి ఫుటేజ్ ఆధారాలు లభించాయి.ఇద్దరు కలిసి రాజంపేట వైపు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా రైల్వే సిబ్బంది ఇటు రావొద్దని చెప్పటంతో అక్కడినుండి ఆటోలో ఎర్రముక్కపల్లె రైల్వే ట్రాక్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరూ పట్టాలపై నడుస్తుండగా, వారిని గమనించిన గూడ్స్ రైలు డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించడంతో ఇద్దరు పట్టాల నుండి కిందకి దిగారు. రైలు వారి దగ్గరకు రాగానే వెంటనే ఇద్దరు రైలు కిందకి దూకారు. కళ్యాణి ఘటనా స్థలంలో మరణించగా.. పూజిత హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాల గురించి ఇప్పటికీ ఏ సమాచారం తెలియలేదు.