మంగ‌ళ‌వారం రోజున పాప‌ను ప్ర‌సాదించ‌టం ఎంతో అపురూపం: చిరంజీవి

మెగా ఇంట సంబ‌రాలు నెల‌కొన్నాయి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంపతుల‌కు పాప‌ పుట్టింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున హైద‌రాబాద్ అపోలో హాస్పిట‌ల్‌లో పాప పుట్టింది. మెగా కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు స‌హా మెగాభిమానులు ఈ విష‌యంతో సంతోషంగా ఉన్నారు. ఈ విష‌యం గురించి అపోలో డాక్ట‌ర్ సుమ‌నా మ‌నోహ‌ర్‌ మాట్లాడుతూ ‘‘ఈరోజు తెల్ల‌వారుజామున ఉపాస‌న‌కు పాప పుట్టింది. త‌ల్లీ బిడ్డా ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నారు. వీలైనంత త్వ‌ర‌గా వారు ఇంటికి కూడా వెళ‌తారు. డాక్టర్ రూమా సిన్హాగారు ఆమెను రెగ్యులర్‌గా ప‌రీక్షించి జాగ్ర‌త్త‌లు చెబుతూ వ‌చ్చారు. అలాగే డాక్టర్ లతా కంచి పార్థ‌సార‌థి న్యూట్రిషన్ సలహాలిస్తూ వచ్చారు. అలాగే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో ఆహార విష‌యంలో, ఫిట్‌నెస్ విష‌యంలో ఉపాస‌న ఎంతో కేర్‌ తీసుకున్నారు. ఆమె అంత జాగ్ర‌త్త‌గా ఉంటూ వ‌చ్చారు కాబ‌ట్టే సుఖ ప్ర‌స‌వం జ‌రిగింది’’ అన్నారు. డాక్ట‌ర్ రూమా సిన్హా మాట్లాడుతూ ‘‘ఉపాసన ఈరోజు ఉదయం పాపకు జన్మేనిచ్చారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు’’ అన్నారు.

మనవరాలు పుట్టటంపై మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా స్పందించారు. ‘‘మంగళవారం ఉద‌యం 1 గంట 49 నిమిషాల‌కు రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కు పాప పుట్టింది. ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పాప ఎంతో అపురూపం. ఎందుకంటే ఎన్నో సంవత్స‌రాల నుంచి వాళ్లు త‌ల్లిదండ్రులై బిడ్డ‌ల‌ను మా చేతిలో పెట్టాల‌ని అనుకుంటున్నాం. ఇన్నేళ్ల‌కు ఆ భ‌గ‌వంతుడి ద‌య వ‌ల‌న‌, అంద‌రి ఆశీస్సులు వ‌ల‌న ఆ కోరిక నేర‌వేరింది. ఇత‌ర దేశాలు, ఇత‌ర ప్రాంతాల నుంచి మా స్నేహితులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు, మా సంతోషాన్ని త‌మ సంతోషంగా భావించే అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వారంద‌రికీ నా కుటుంబం త‌ర‌పున ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను. పెద్ద‌లు పాప పుట్టిన ఘ‌డియ‌లు చాలా మంచివ‌ని అంటున్నారు. ఆ ప్ర‌భావం ముందు నుంచి చూపిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో చ‌ర‌ణ్ ఎదుగుద‌ల‌, త‌ను సాధించిన విజ‌యాల‌ను కానివ్వండి. అలాగే ఈ మ‌ధ్య వ‌రుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్. ఇలా మా ఇంట్లో అన్నీ శుభ‌కార్యాలే జ‌ర‌గ‌టం చూస్తుంటే ఈ బిడ్డ ప్ర‌భావం కూడా ఉంద‌ని నేను అనుకుంటున్నాను. నా కుటుంబం ఆంజనేయ స్వామినే న‌మ్ముకున్నాం. ఆయ‌న‌కు సంబంధించిన మంగ‌ళ‌వారం రోజున ఆడ బిడ్డ‌ను ప్ర‌సాదించ‌టం అనేది అపురూపంగా భావిస్తున్నాం. అపోలోలో బెస్ట్ టీమ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చాలా సుఖంగా ప్ర‌స‌వం జ‌రిగింది. అంద‌రికీ ధ‌న్య‌వాదాలు’’ అని తెలిపారు.