రఘురామ ప్రయోగించబోయే తదుపరి అస్త్రాలు అవేనా.?

Raghurama

Raghurama

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందన్నది నిర్వివాదాంశం. అయితే, ఈ విషయంలో రఘురామకి కూడా షాక్ తగిలింది.. ఆయన మీడియాతో మాట్లాడకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడమే అందుక్కారణం. ఆ విషయం పక్కన పెడితే, రఘురామ వ్యవహారం ముందు ముందు ఇంకెలాంటి మలుపులు తిరగనుంది.? అన్న విషయమై రాజకీయ వర్గాల్లో ఆస్తకికరమైన చర్చ జరుగుతోంది. బంతి సుప్రీంకోర్టులోకి వెళ్ళింది.. మరోపక్క, రఘురామకు సంబంధించి తనకు అందించిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కూడా స్పందించారు.. నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖని లోక్ సభ స్పీకర్ కోరినట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం.. రఘురామ విషయంలో చాలా ఖచ్చితమైన అభిప్రాయంతో వుంది. రాజద్రోహం కేసు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

అందుకు తగ్గ ఆధారాల్ని ఇప్పటికే సేకరించిన ఏపీ సీఐడీ, మరింతగా ఆ ఆధారాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించనుంది. న్యాయస్థానాల్లో వాదనలు మరింత పటిష్టంగా వుంటే, రఘురామ కేసులో ప్రభుత్వానికి ఊరట కలుగుతుంది. ప్రభుత్వానికి ఈ కేసుకీ సంబంధం లేదనీ, చట్టం తన పని తాను చేసుకుపోతుందనీ.. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. రఘురామ వర్సెస్ వైఎస్ జగన్ ప్రభుత్వం.. అన్నట్టుగానే ఈ కేసు ప్రొజెక్టు అవుతోన్నమాట వాస్తవం. ఏపీ సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేయడంతోనే ఈ పరిస్థితి. అలాగని ఏపీ సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేయకూడదన్న రూల్ కూడా ఏమీ లేదు. అయితే, రఘురామని అరెస్టు చేసిన తర్వాత, ఆయన ఒంటి మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాల్సిన ఏపీ సీఐడీ.. ఆ విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించిందా.? అన్న అనుమానాలు.. ఆర్మీ ఆసుపత్రి వైద్య నివేదిక తర్వాత బలపడ్డాయి. ఏం జరిగిందన్నది విచారణలో తేలాలి. ఆ విచారణ ఇప్పటికే ప్రారంభమైనట్టే లెక్క. విచారణ అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ వంటివాటితో చేయాలని రఘురామ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోరుతున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. ముందు ముందు రఘురామ నుంచి మరిన్ని అస్త్రాలు తెరపైకి రానున్నాయి.. వాటిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా వుండాల్సిందే.