అమరావతి రైతుల పాదయాత్రతో ఒరిగేదేంటి.?

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తోన్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర కూడా చేశారు. అమరావతి నుంచి తిరుపతి వరకు జరిగిన ఆ పాదయాత్ర సక్సెస్ అయ్యింది కూడా.

కానీ, వైసీపీ సర్కారు.. మూడు రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడంలేదు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటన్న సోయ అటు వైసీపీ సర్కారుకీ లేదు.. ఇటు భూములిచ్చిన రైతులకీ లేదు.. ఇతర రాజకీయ పార్టీల్లోనూ ఆ సోయ కొరవడింది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో ఏం జరిగిందో చూశాం. విభజన తప్పదని తేలిపోయింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ఏం కావాలన్నదానిపై డిమాండ్లు రాలేదు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపంగా మారింది. అమరావతి విషయంలోనూ అదే జరగబోతోందా.?

అంటే, అంతిమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని రగడ కారణంగా నష్టపోతున్నమాట వాస్తవం. వైసీపీ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది.. దాన్నుంచి వెనక్కి తగ్గింది. కానీ, పూర్తి మెజార్టీ వైసీపీకి వుంది గనుక.. మూడు రాజధానుల విషయంలో మొండి పట్టుదల వీడదు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నంతవరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. అలాగే ఏపీలో వైసీపీ అధికారంలో వున్నంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది వుండదు.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రస్తుతం పరిణామాలు అలాగే తగలడ్డాయ్.

సో, రైతుల పాదయాత్ర వల్ల వీసమెత్తు ఉపయోగం కూడా వుండదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కాళ్ళు నొప్పులు పుట్టడం తప్ప.. ఏం ప్రయోజనం.? అన్న చర్చ అమరావతి రైతుల మహా పాదయాత్ర నేపథ్యంలో సర్వత్రా వినిపిస్తోంది.