ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయ పార్టీలకు వెంటిలేటర్ పై చికిత్స అనే మాటలు వింటూ ఉంటాం, ఏపీలో టీడీపీ పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. బాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే వుంది. ఇప్పటికే అనేక మంది పార్టీని వదిలివెళ్ళిపోయారు.తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి నేతలతో పార్టీని నడుపుకొని వస్తున్నాడు చంద్రబాబు. ఇక గత కొద్దీ రోజుల నుండి గన్నవరం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
అక్కడ టీడీపీ పార్టీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వెళ్ళిపోయాడు. అక్కడి వైసీపీ అంతర్గత పోరు పక్కన పెడితే, అసలు టీడీపీ పరిస్థితి ఏమిటనేది కొంచం ఆలోచించవలసిన విషయం. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం పెత్తనం ఎక్కువగా ఉంటుంది. ఇక వంశీ వైసీపీ లోకి వెళ్లటంతో టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. దీనితో చంద్ర బాబు బచ్చుల అర్జునుడుని గన్నవరం పార్లమెంట్ స్థానానికి అధ్యక్షుడిగా నియమించాడు. బీసీ నేతైనా అర్జునుడిని ఇక్కడ నియమించటం రాజకీయంగా కీలకమైన ఎత్తుగడ అని అంటున్నారు. గన్నవరంలో కేవలం కమ్మ సామాజికవర్గాన్ని నమ్ముకుంటే ఇక పని జరగదని, అందులో చాలా మంది కార్యకర్తలు వంశీ వెంట నడిచి వైసీపీలోకి వెళ్లిపోయారని, కాబట్టి కేవలం కమ్మ వర్గంతో పార్టీని నడిపించలేమని, మిగిలిన వర్గాలకు కూడా దగ్గర కావాలనే ఉద్దేశ్యంతోనే మచిలీపట్నం కు చెందిన బీసీ నేత అర్జునుడిని గన్నవరంకి తీసుకోని వచ్చాడు చంద్రబాబు.
దీనితో టీడీపీ కమ్మకుల పార్టీ అనే ముద్ర కొంచం చెరిపేచుకోవచ్చు, మిగిలిన కులాలకు కూడా అగ్రపీఠం వేస్తున్నామనే భరోసా కల్పించవచ్చని టీడీపీ అధినాయకత్వం భావించి ఉండవచ్చు. అయితే గన్నవరంలో బలమైన నేతగా ఎదిగిన వల్లభనేని వంశీని తట్టుకొని అర్జునుడు ఎంత వరకు నిలబడి పోరాటం చేయగలడో చూడాలి. స్థానికంగా పట్టున్న వైసీపీకి చెందిన యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావు లాంటి నేతలే వంశీని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు, అలాంటిది అసలు నియోజకవర్గంలో ఎలాంటి పట్టులేని అర్జునుడు ఎంత వరకు టీడీపీ పార్టీని ముందుకు నడిపిస్తాడు అనేది చూడాలి. కాస్తోకూస్తో ప్రస్తుతం టీడీపీకి కృష్ణ జిల్లాలోనే కొంచం వెయిట్ వుంది. ఆ జిల్లాలో గన్నవరం కీలకమైన నియోజకవర్గంలో ఇందులో కనుక టీడీపీ తన పూర్వవైభవం తెచ్చుకుంటే,పార్టీ గాడిలో పడినట్లే అంటూ విశ్లేషకులు చెపుతున్న మాట.