Bappi Lahiri:ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి ముంబైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మరణ వార్త విని యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్ అనే భేదం లేకుండా అన్ని భాషలలో తన మార్క్ సంగీతాన్ని అందించారు. ఈయన మరణానికి కారణం OSA (అబ్స్టక్టివ్ స్లీప్ అప్నియా) అని డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి వల్ల బప్పిలహరి గుండె ఆగిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు అందరూ ఈ వ్యాధి ఏంటి, దీనిని ఎలా గుర్తించాలి అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు.
సాధారణంగా అనేకమంది గాఢనిద్రలో ఉన్నప్పుడు గురక పెడుతుంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే గురక వస్తుంది. దీనినే వైద్య భాషలో స్లీప్ అప్నియా గా పిలుస్తారు. అయితే కొన్నిసార్లు ఈ సమస్య ఎక్కువ అయ్యి గుండె పనితీరు మీద ప్రభావం చూపుతుంది. ఇది ఎక్కువ అయితే గుండె సడన్ గా ఆగిపోవడం జరుగుతుంది. దీని తీవ్రతను బట్టి ఈ వ్యాధిని మూడు రకాలుగా విభజించారు. అవే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, సెంట్రల్ స్లీప్ అప్నియా, కాంప్లెక్స్ స్లీప్ అప్నియా. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా తో బాధపడేవారిలో నిద్రపోతున్న సమయంలో ఎగువ శ్వాస నాళ్ళలు కుంచించుకుపోతాయి. దీని వల్ల గురక వస్తుంది, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కూడా పడిపోతాయి. కొన్ని సందర్భాలలో శ్వాస ఆగిపోయి నాళ్ళలు వ్యాకోచించిన తర్వాత తిరిగి శ్వాస తీసుకోవడం జరుగుతుందని, ఈ వ్యాధితో బాధపడే వారికి నిద్రలో ఆటంకం కలుగుతుందని, కొన్ని సందర్భాలలో ప్రాణాంతకంగా మారవచ్చు అని న్యూఢిల్లీలోని PSRI ఆస్పత్రికి చెందిన సీనియర్ డాక్టర్ నీతు జైన్ తెలిపారు.
ఈ వ్యాధిగ్రస్తులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఉదయం ఎక్కువ సేపు నిద్ర పోవడం, అధిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు ఉండటం, పెద్దగా గురక పెట్టడం, ఉదయం లేవగానే నిస్సత్తువుగా ఉండడం, నోరు ఎండిపోవడం, తల నొప్పిగా ఉండటం, పూర్తిగా నిద్ర లేకపోవడం వంటివి. ONA అనే వ్యాధి బారిన పడటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో అధిక బరువు, వయసు మీరడం, శ్వాసకోశ సమస్యలు, వాయు మార్గం ఇరుకుగా ఉండటం, జీవనశైలిలో మార్పులు కూడా కారణంగా చెప్పవచ్చు.
ఈ వ్యాధికి కచ్చితంగా చికిత్స ఉందని డాక్టర్లు చెబుతున్నారు.దీనికి ముఖ్య కారణం అధిక బరువు, శ్వాస సమస్యలు కాబట్టి వాటి మీద అవగాహన పెంచుకొని జాగ్రత్త పడటం వల్ల ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.