మినిస్టర్ అంబటి రాంబాబు, అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో మంత్రి పదవి దక్కించుకున్నారు. అదీ కీలకమైన జల వనరుల శాఖకు ఆయన మంత్రి అయ్యారు. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు.. అని వ్యాఖ్యానించడం ద్వారా మంత్రి అంబటి రాంబాబు వివాదాల్లోకెక్కారు. ‘అందరికీ అన్నీ తెలియాలనే రూల్ ఏముంది.?’ అంటూ మంత్రి అంబటి అప్పట్లో అమాయకంగా ప్రశ్నించారు.
రాష్ట్రానికి జీవనాడి పోలవరం. ఆ ప్రాజెక్టుకి సంబంధించి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సింది మంత్రి అంబటి రాంబాబే. కానీ, అది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం నిధులు ఇస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి కాదు. పైగా, పర్యవేక్షణ అంతా కేంద్రానిదే. రాష్ట్రంలో మిగతా నీటి ప్రాజెక్టులకూ నిధుల విషయమై ఇబ్బందులున్నాయి. వెరసి, మంత్రి అంబటి రాంబాబుది నామమాత్రపు శాఖ.. అనే భావన చాలామందిలో కలుగుతోంది.
చిత్రమేంటంటే, వైసీపీ అనుకూల మీడియాలోనే మంత్రి అంబటికి వ్యతిరేకంగా కథనాలొస్తున్నాయి. పేరు ప్రస్తావించకుండానే, గుంటూరుకి చెందిన ఓ మంత్రి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చంటూ కథనాలు గుప్పుమంటున్నాయి. వీటిని ఎవరు ఎందుకు వండి వడ్డిస్తున్నారన్నదానిపై మంత్రి అంబటి ఒకింత గుస్సా అవుతున్నారట.
తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీని స్వయానా టీడీపీ అను’కుల’ మీడియానే దెబ్బకొట్టింది. ఇప్పుడు వైసీపీ విషయంలోనూ అదే జరుగుతోందా.? అన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. మంచి వాగ్ధాటి వున్న నేతగా అంబటి రాంబాబుకి గుర్తింపు వుంది. కానీ, గతంలో ఓ అమ్మాయితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడారంటూ ఒకటికి రెండుసార్లు వివాదం తెరపైకొచ్చింది.
ఇలా చాలా కారణాలతో అంబటి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోవడం కష్టమన్నది వైసీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారం. మరి, దీనిపై అంబటి ఏమంటారో.!