Blood Cancer:ఈ మధ్య కాలంలో అనేక మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రాథమిక దశలో క్యాన్సర్ సమస్యను గుర్తించక పోవటం వల్ల తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. క్యాన్సర్ సోకిన వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి, అవేంటో తెలుసుకొని వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ గుర్తించడం వల్ల తగిన వైద్యం చేయించుకోవడం వీలవుతుంది.
మన రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వారి రక్తకణాల ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో కొన్ని రకాల రక్త కణాలు విపరీతంగా పెరిగి సమూహాలుగా ఏర్పడతాయి. ఈ సమూహాలను క్యాన్సర్ కణాలు అని అంటారు. బ్లడ్ క్యాన్సర్ కు గురైన వారిలో తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరుగుతాయి. దీంతో ఏవైనా గాయాలు అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే
ప్లేట్లెట్స్ స్థాయి పూర్తిగా తగ్గిపోతుంది. దీని వల్ల శరీరం మీద చిన్న గాయమైనా, దద్దుర్లు అయినా తీవ్ర రక్తస్రావం జరుగుతుంది.
శరీరంలో తెల్ల రక్త కణాలు రోగాలతో పోరాడే సామర్థ్యం కలిగి ఉంటాయి. కానీ తెల్ల రక్త కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాటి ప్రభావం ఇతర కణాల మీద చూపుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీపవర్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది. బ్లడ్ క్యాన్సర్ అనేది మూడు రకాలు… లుకేమియా, లింఫోమా, మైలోమా…. బ్లడ్ క్యాన్సర్ కు గురైన వారిలో ఏదైనా చిన్న గాయమైనా విపరీతంగా రక్తస్రావం జరగడం, చర్మం మీద దద్దుర్లు పుట్టడం, ఆకలి లేకపోవడం, త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉండటం, తరచుగా జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ లక్షణాలే కాకుండా ఉన్నపాటుగా బరువు తగ్గడం, పళ్ళు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం, పడుకున్నప్పుడు విపరీతంగా చెమటలు పడుతుంటాయి. ఇదిలా ఉండగా రక్తంలో ఎర్రరక్తకణాలు తగ్గటం వల్ల రక్తహీనత సమస్య బారిన కూడా పడవచ్చు. దీనికి కారణంగా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు, ఫలితంగా ఆయాసానికి గురవుతారు. ఎముకల నొప్పి కూడా వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకొని తగిన వైద్యం చేయించుకోవడం మంచిది.