Cancer: క్యాన్సర్‌ను ముందే గుర్తించే రక్త పరీక్ష.. ఈ ప్రయోగం సక్సెస్ అయితే..!

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్యాన్సర్ బారిన పడుతుండగా.. లక్షలాది మంది ఈ మహమ్మారికి బలైపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2024లో దాదాపు 1 కోటి మంది క్యాన్సర్‌తో మరణించారు. ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన, భయం కలిగించే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించగలిగితే ఎంతోమందిని ప్రాణాపాయం నుండి రక్షించవచ్చు. ఇప్పుడు అచ్చంగా ఇదే మార్గంలో ఓ శాస్త్రీయ ఆవిష్కరణ సాగుతోంది.

క్యాన్సర్… ఈ ఒక్క పదమే చాలామందిలో గుబురుపడేలా చేస్తుంది. శరీరాన్ని మెల్లిగా కుదిపేసే ఈ వ్యాధి పేరు వినగానే జనాల్లో భయం, ఆందోళన, మృత్యు భయాలే మెదళ్లలో తొలిచేస్తాయి. చికిత్సకు ఎన్నో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చినా, క్యాన్సర్‌ను ముందే గుర్తించలేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన ఓ శాస్త్రీయ పరిశోధన ప్రజల్లోకి కొత్త ఆశను నింపుతోంది.

ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఒక సంచలన విషయం వెల్లడైంది. క్యాన్సర్ శరీరంలో ఏర్పడే మూడు సంవత్సరాల ముందే అది సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని వారు గుర్తించారు. ముఖ్యంగా క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని ముందుగానే తెలుసుకోవడానికి, శరీరంలోని సూక్ష్మ మార్పులను కనిపెట్టడానికి ఓ ప్రత్యేకమైన రక్త పరీక్షను అభివృద్ధి చేస్తున్నారు. ఇది పూర్తిగా విజయవంతమైతే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయగలదు.

ఈ పరీక్ష ద్వారా శరీరంలోని జీవకణాల్లో జరిగే చిన్నచిన్న మార్పులను, డీఎన్ఏ స్థాయిలో కలిగే బదిలీలను గుర్తించవచ్చు. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, కణాలలో కొన్నిరకాల ప్రోటీన్ మార్పులు, ఫ్రీ రాడికల్స్ ప్రభావం మొదలైనవి క్యాన్సర్‌కు సంకేతాలుగా మారతాయి. ఇవి సాధారణంగా శరీరంలో తక్కువస్థాయిలోనే ఉన్నా, ప్రత్యేకమైన బయోమార్కర్లతో కనిపెట్టవచ్చు.

ఈ పరిశోధనలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెన్సర్ రీసెర్చ్, అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నిర్వహిస్తున్న నివేదికల్లో భాగంగా ప్రచురితమయ్యాయి. క్యాన్సర్‌ అంటే చావే తప్పదనే అపోహను ఈ పరిశోధన చెదిపించనుంది. శరీరంలో వ్యాధి ఊసు కూడా తెలియకముందే దాన్ని పసిగట్టి, ముందు జాగ్రత్తలు తీసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న ఆశ చూపుతోంది. ఒక రోజు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు క్యాన్సర్‌కు సంబంధించిన రక్త పరీక్షలు కూడా భాగం కావచ్చు. అదే జరిగితే కోట్లాది మంది ప్రాణాలను రక్షించ వచ్చు.