Cancer: కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉంటే.. మీకూ రావొచ్చని నిపుణులు ఏమంటున్నారంటే..?

ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధులలో ముందంజలో నిలిచిన క్యాన్సర్ ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని బలి తీసుకుంటున్న ఈ వ్యాధి క్రమంగా మరింత విస్తరిస్తోంది. తాజాగా వెలువడిన ఒక నివేదికలో, ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. ఇది భారత ఆరోగ్యరంగానికి పెద్ద సవాల్‌గా మారింది.

నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ఆధారంగా వెలువడిన వివరాల ప్రకారం.. భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే దేశ జనాభాలో దాదాపు 11 శాతం మంది ఈ వ్యాధితో ఏదో ఒక సమయంలో పోరాడే పరిస్థితి నెలకొంటోంది. ఈ గణాంకాలు చూసిన వారంతా షాక్ అవ్వక తప్పడం లేదు.
నిపుణుల ప్రకారం, క్యాన్సర్‌కు కేవలం వంశపారంపర్య కారణాలే కాకుండా, ఆధునిక జీవనశైలి, పర్యావరణ కాలుష్యం, అస్వస్థకరమైన ఆహారపు అలవాట్లు కూడా ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడం, నిరంతర ఒత్తిడి వంటి అంశాలు శరీరంలోని కణాలను దెబ్బతీసి క్రమంగా క్యాన్సర్‌కు దారితీస్తాయి. అలాగే, మహిళల్లో రొమ్ము పాలు ఇవ్వకపోవడం, గర్భం ధరించకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు కూడా రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్‌లకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

అదే సమయంలో, జెనెటిక్ టెస్ట్ ప్రాముఖ్యతను కూడా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడ్డట్లయితే, ఇతర సభ్యులు ముందుగానే ఈ రక్తపరీక్ష చేయించుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా శరీరంలో క్యాన్సర్‌కు దారితీసే లోపభూయిష్ట కణాలు ఉన్నాయా లేవా అన్నది ముందుగానే గుర్తించవచ్చు. దీంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్‌ను నివారించే అవకాశం ఉంటుంది. ఇక ఆహారపు అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌లకు దూరంగా ఉండడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా, రోజువారీ వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించే పద్ధతులు అవలంబించడం కూడా చాలా అవసరం.

మొత్తం మీద, క్యాన్సర్ కేసులు భారతదేశంలో వేగంగా పెరుగుతుండటంతో ఇది ప్రజలందరికీ ఒక హెచ్చరికలాంటిదే. ముందస్తు పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.