పూర్వకాలంలో అందరూ నేలపై కూర్చొని తినేవారు. కానీ ప్రస్తుత కాలంలో డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని భోజనం చేయటానికి ప్రజలు బాగా అలవాటు పడ్డారు. అంతేకాకుండా చాలామంది ఆరోగ్య సమస్యల వల్ల కింద కూర్చొని భోజనం చేయలేకపోతున్నారు. అయితే నేలపై కూర్చొని భోజనం చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. నేలపై కూర్చొని భోజనం చేయటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నేలపై కూర్చొని భోజనం చేయటం వల్ల శరీరంలో జీర్ణ క్రియ మెరుగుపడి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. నేలపై కూర్చొని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పై ఒత్తిడి పడటం వల్ల తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. అందువల్ల అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
ప్రస్తుత కాలంలో చాలామంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బీపీ సమస్యతో బాధపడేవారు నేల మీద కూర్చొని భోజనం చేయటం వల్ల వెన్నెముక దిగువ భాగంపై ఒత్తిడి పడుతుంది. నేలపై కూర్చొని తినేటప్పుడు శ్వాస నెమ్మదిగా సాగి కండరాల ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ఈ క్రమంలో శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి బిపి సమస్య తగ్గుతుంది.
సాధారణంగా మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం వల్ల సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. కానీ అలాంటివారు నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల శరీరంలో కండరాలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా ఇలా నేలపై కూర్చొని తినేటప్పుడు కాళ్లు ముడుచుకొని కూర్చోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా క్రమంగా తగ్గుతాయి.