తెలుగుదేశం పాలనలో చేసిన ‘పసుపు అప్పు’ సంగతేంటి.?

పాత ప్రభుత్వం కంటే ఎక్కువ అభివృద్ధి కొత్త ప్రభుత్వం చేస్తుందని ఎవరు ఆశించినా.. మన రాజకీయ వ్యవస్థలో అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఓ ప్రభుత్వం చేసిన అప్పుకంటే, తర్వాతి ప్రభుత్వం ఎక్కువ అప్పు చేయడమే ఇప్పుడు నడుస్తున్నా నయా పొలిటికల్ పరిపాలన ట్రెండ్. పరిస్థితులు మారాయి. ఆదాయాన్ని సృష్టించే అభివృద్ధి కంటే, అప్పులు పెంచే అభివృద్ధి లేదా కేవలం అప్పుల కోసమే పుట్టకొచ్చే సంక్షేమ పథకాల మీదనే పాలకులకు ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంటుంది. వాటిల్లో వచ్చే కమిషన్లు అలాంటివి మరి.. అంటారు రాజకీయ పరిశీలకులు.

చంద్రబాబు హయాంలో రికార్డు స్థాయిలో అప్పులు జరిగాయి. అప్పట్లో, ‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వుంది.. విభజన కారణంగా జరిగిన నష్టం వల్లే అదంతా..’ అంటూ ఎడా పెడా అప్పులు చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడేమో, సుద్దపూసల్లా, వైసీపీ పాలనలో జరుగుతున్న అప్పులపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ‘మీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని మా పార్టీ తీరుస్తుందా.?’ అని టీడీపీ నిలదీసేస్తోంది. మరి, చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల్ని తెలుగుదేశం పార్టీ ఏమన్నా తీర్చుతోందా.? ఇప్పుడు జగన్ పాలనలో జరుగుతున్న అప్పుల్ని ప్రశ్నిస్తున్న పార్టీలు, రేప్పొద్దున్న అధికారంలోకి వస్తే అంతకు మించి అప్పులు చేయడం ఖాయం. ఎవరు ఎంత ఎక్కువ అప్పు చేస్తే అంత గ్రేట్ అన్నట్టు తయారైంది పరిస్థితి. కరోనా ఓ కుంటి సాకు మాత్రమే ఏ ప్రభుత్వానికైనా. అభివృద్ధి మరచి, సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే.. ఆ సంక్షేమ ఫలాలే ప్రజల నెత్తిన గుదిబండలుగా మారతాయి. కానీ, తప్పదు.. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థే అలా వుంది మరి. ఒక్కటి మాత్రం నిజం.. తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అడ్డగోలుగా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని మరింత అప్పుల కూపంలోకి నెట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకి, ప్రస్తుతం జరుగుతున్న అప్పులపై మాట్లాడే నైతిక హక్కు లేదు.