కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. నిజానికి, మొదటి వేవ్ పీక్.. కంటే ఇంకా రెండింతలు పైనే కేసులు రోజువారీగా నమోదవుతున్నాయి. అయినాగానీ, రోజువారీ కేసులు 4 లక్షలు దాటిన పరిస్థితి నుంచి.. రెండున్నర లక్షల లోపు మాత్రమే రోజువారీ కేసులు నమోదవుతున్న పరిస్థితికి వచ్చింది. ఇదిలా వుంటే, గ్రామీణ భారతం కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంది. అక్కడ నమోదువుతున్న కేసులు అధికారిక లెక్కల్లోకి రావడంలేదు. స్థానికంగా వుంటోన్న ఆర్ఎంపీ వైద్యులు అందుబాటులో వున్న కరోనా కిట్లతో టెస్టులు చేసేసి, వాటి ఫలితాల్ని అధికారులకు అందించకుండానే వైద్యం చేసేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చెబుతున్న అధికారిక లెక్కలకీ, కింది స్థాయి పరిస్థితులకీ అస్సలు పొంతన లేదు. అయితే, ఆక్సిజన్ కోసం డిమాండ్ తగ్గడం చూస్తోంటే, పరిస్థితి అదుపులోకి వస్తోందనే అనుకోవాలి. సరే, సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గుతోందనే అనుకుందాం. కానీ, తర్వాతేంటి.? కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండగా, బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి.
ఇదో ప్రమాదకరమైన సంకేతం. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే మందులు ఇప్పుడు దొరకడం గగనమైపోయింది. మరోపక్క, కేసులు తగ్గుముఖం పడుతుండడంతో, లాక్ డౌన్ వెసులుబాట్లు జూన్ మొదటి వారం నుంచి మొదలవుతాయన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, మూడో వేవ్ కోసం ఎక్కువ సమయం ఎదురుచూడాల్సిన పని వుండదు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచుకుండా, లాక్ డౌన్ వెసులుబాట్లు కల్పిస్తే.. పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతుంది. ఇదిలా వుంటే, కేసులు తగ్గుముఖం పడుతుండడం కొన్ని రాష్ట్రాల్లోనే కనిపిస్తోంది. ఇంకొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల నమోదు నిలకడగా (లాక్ డౌన్ చర్యల తర్వాత కూడా) వుంటుండడం.. అంటే తగ్గకపోవడం.. ఆందోళన కలిగిస్తోంది.