విజయనగరం జిల్లాకి సంబంధించి ఇద్దరు రాజ వంశీయులైన రాజకీయ నాయకులపై అధికార పార్టీ గుస్సా అవుతోంది. అందులో ఒకరు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కాగా, ఇంకొకరు మాజీ రాష్ట్ర మంతి సుజయ కృష్ణ రంగారావు. విజయనగరం, బొబ్బిలి రాజ వంశాలకు చెందిన వారసులు ఈ ఇద్దరూ. మన్సాస్ వ్యవహారం చుట్టూ ఎన్ని వివాదాలు నడుస్తున్నాయో చూస్తున్నాం. బొబ్బిలి వ్యవహారం చుట్టూ కూడా అవే తరహా వివాదాలు షురూ అవుతున్నాయి. దేవాలయాలకు ట్రస్టు ఛైర్మన్ల ద్వారా లాభం లేదనీ, దేవాలయాల భూములు అన్యాక్రాంతమైపోతున్నాయనీ మంత్రులు బొత్స సత్యానారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సంగతి సరే, వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడుల మాటేమిటి.? అంతర్వేది రధం దగ్ధమైతే ఈ రోజు వరకూ దోషులెవరో ఎందుకు తేల్చలేదు.? అన్న చర్చ తెరపైకొస్తోంది.
‘దేవాలయాల్ని ధ్వంసం చేసినవారే మొసలి కన్నీరు కార్చుతున్నారు..’ అని ఓ సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ సర్కారుని కూల్చే యత్నంలో కొందరు కుట్ర పూరితంగా దేవాలయాల్ని టార్గెట్ చేసుకున్నారన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వాన్ని నడిపేవారెవరూ సమాజంలో అలజడి కోరుకోరు. ఆ ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకున్నవారి పనే ఇదే. అయినాగానీ, ప్రభుత్వం ఆయా ఘటనల్లో దోషుల్ని గుర్తించలేకపోవడమంటే, అధికార వైఫల్యంగానే భావించాలి. ప్రభుత్వం తరఫున ఇన్ని వైఫల్యాలు పెట్టుకుని, లేనిపోని వివాదాల్ని దేవాలయాల చుట్టూ, దేవాలయాలకు సంబంధించిన ట్రస్టుల చుట్టూ రాజేయడం.. అధికార పార్టీకి రాజకీయంగా అస్సలు మంచిది కాదు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయేలా చేస్తాయి ఇలాంటి వివాదాలు అధికార పార్టీకి.