Suicide: ప్రస్తుత కాలంలో ఏ సమస్య వచ్చినా క్షణాలలో సమస్య పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నారు. సమస్యకి పరిష్కారం లభించకపోతే మనస్తాపంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు ,భార్య భర్తల గొడవలు ఇలా ఏ సమస్య వచ్చినా సమస్య కి పరిష్కారం చూడకుండా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే..పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో పెళ్లి జరిగిన వారానికి నవ వధువు గోదావరిలోకి ఆత్మహత్య చేసుకుంది.ఈనెల 20న.. పట్టిసీమ గ్రామానికి చెందిన కరిబండి అనురాధను , కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన శివప్రసాద్ కి ఇచ్చి తల్లితండ్రులు వివాహం జరిపించారు. వీరిద్దరి పెళ్లి జరిగిన వారానికి అనురాధ భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో ఉదయమే అనురాధ గోదావరి నది దగ్గరికీ వెళ్లి నదిలో చేపలు పట్టడాని వచ్చిన జాలర్లు చూస్తుండగానే నదిలో దూకేసింది.
జాలర్లు వెంటనే అప్రమత్తమై తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయిన అనురాధ జాడ కనిపించలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగిన వారానికి నవ వధువు ఇలా చేసుకోవటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కూతురు మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.