అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. ఈ రెండూ ఎప్పటికీ ఒకటి కాదు. సంక్షేమ పథకాలు అమలు చేసి, దాన్ని అభివృద్ధిగా చూపించాలనుకోవడం హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారు కేవలం సంక్షేమంతోనే నెట్టుకొచ్చేస్తోంది గత రెండున్నరేళ్ళుగా. అసలు అభివృద్ధి అన్న మాటకే ఆస్కారం లేకుండా పోతోంది.
‘ప్రపంచమే కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో సంక్షేమం ఒక్కటే ప్రజల్ని కాపాడుతోంది. సంక్షేమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి..’ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
అభివృద్ధి ఫలాల్ని సంక్షేమంలోకి కొంత మేర మరల్చితే, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. సమాజంలో అసమానతలు తొలగుతాయి. అదే అభివృద్ధిని మరచి, సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తే.. చివరికి సంక్షోభమే మిగులుతుందన్న కనీస ఆర్థిక సూత్రాన్ని పాలకులు మర్చిపోతే ఎలా.?
రెండున్నరేళ్ళలోనే మూడు లక్షల కోట్లకు పైగా కొత్త అప్పులు రాష్ట్రం చేసిందన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. ‘అప్పులు చేశాం.. కాదనలేం..’ అంటూ ప్రభుత్వమే, తాము చేసిన అప్పుల్ని అంగీకరిస్తోంది. అప్పులు కావవి, నిజానికి తప్పులు.
ముందు ముందు ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే నానా తంటాలూ పడాల్సి వస్తుంది. మరి, అసలు తీరేదెప్పుడు.? అసలు తీరకుండా, అప్పులకు వడ్డీలు కడుతూ పోతే, అభివృద్ధికి నిధుల కేటాయింపు అనేది మిధ్యగా మారిపోదా.?