Raipur: భారతదేశంలో పెళ్లిని ఒక వేడుకగా చేసుకునే సంప్రదాయం ఉంది. తమ తాహతు తగ్గట్టుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుని ఆనందిస్తారు. ఈ మధురానుభూతుల్ని జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఆనందిస్తారు. అయితే పెళ్లిలో భాగంగా ప్రాంతాలను బట్టి రకరకాల తంతులు నిర్వహిస్తారు. ఇలా జరుపుకుంటున్నప్పుడు కొన్నిసార్లు సరదా సంఘటనలు, విషాద సంఘటనలు కూడా జరుగుతుంటాయి.
తాజాగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. వధూవరులు ఇద్దరు స్టేజి మీదకు సినిమా ఈవెంట్స్ లో మాదిరిగా పై నుండి కిందకి దిగుతున్న సమయంలో వారు కూర్చుని ఉన్న పరికరం త్రాడు తెగిపోవడంతో క్రిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరకీ స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని సమాచారం.
దీనికి సంభందించిన వీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంగీత్ లో భాగంగా జరిగిన ఈవెంట్ లో సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఈవెంట్ మేనేజర్ తెలిపారు. అయితే ఇద్దరికీ పెద్ద గాయాలేమి కాకపోవటం అదృష్టకరమని, ఇలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.