పెళ్ళికి నిరాకరించిందని నడిరోడ్డు మీద మైనర్ బాలికపై దాడి చేసిన వ్యక్తి..!

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనని పెళ్లి చేసుకోవటానికి నిరాకరించిందన్న కారణంతో 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అంతేకాకుండా అందరూ చూస్తుండగానే జుట్టు పట్టుకొని నడిరోడ్డుపై ఆ బాలికను ఈడ్చుకెళ్ళిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

వివరాలలోకి వెళితే… ఓంకార్‌ తివారీ అలియాస్‌ మనోజ్‌ అనే వ్యక్తి రాయ్‌పూర్‌లోని గుధియారీ ప్రాంతంలో దుకాణం నడుపుతున్నాడు. గత కొన్ని రోజులుగా అతని షాపులో 16 ఏళ్ల బాలిక పని చేస్తోంది. అయితే ఇటీవల వివిధ కారణాల రీత్యా తాను ఉద్యోగం మానేస్తానని ఓంకార్‌ తివారీకి చెప్పింది. దీంతో ఓంకార్‌ తివారీకి పెళ్ళి చేసుకుంటానని బాలికను అడిగాడు. దానికి బాలిక ఒప్పుకోలేదు. బాలిక పెళ్లికి ఒప్పుకోకపోవడంతో శనివారం సాయంత్రం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి.. పెళ్లి చేసుకుంటానని బాలిక తల్లి ని అడిగాడు. దీనికి ఆ బాలిక, బాలిక తల్లి ఇద్దరు నిరాకరించారు.

దీంతో వివాహానికి నిరాకరించిందని ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి.. బాలికపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అంతే కాకుండా అందరూ చూస్తుండగా బాలిక జట్టుపట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నింధితుడికి కఠినంగా శిక్షిస్తామని రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.