Cow dung: పెరట్లో పేడ దొంగతనం.. రైతు పోలిస్ కంప్లైంట్..! ఎందుకా కంప్లైంట్ అంటే..

Cow dung: తన పెరట్లోని ఆవులు ఇచ్చే పాలే కాదు.. పేడ కూడా ఆ రైతుకే చెందుతుంది.. నిజం. కళ్లాపి కోసం పేడ కావాలన్నా.. సదరు ఆవు, గెదెలు ఉన్న రైతును అడిగి కానీ.. ఆ కొంచెం పేడ తీసుకెళ్లలేం. కానీ.. తన అనుమతి కాదు కదా.. కేజీల్లో పోగేసిన తన ఆవుల పేడను కొందరు దుండగులు దొంగతనం చేస్తే సహిస్తాడా? పైగా పనిగట్టుకుని ఆ పేడను దాచాడు. ఇప్పుడా పేడను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఏంచేయాలో తెలీక పోలీసు కేసు పెట్టాడు ఆ రైతు. పేడ దొంగతనం చేసిన దుండగులను పట్టుకోవాలని తన ఫిర్యాదులో కోరాడు. విచిత్రమైన ఈ సంఘటన ఎక్కడ జరిగిందో.. చదవండి..

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోబ్రా జిల్లాలోని ధూరెనా గ్రామంలో జరిగిందీ సంఘటన. గ్రామానికి చెందిన రైతు కమాన్ సింగ్ కన్వార్.. ఆ గ్రామ గోధాన్ సమితికి అధ్యక్షఉడు కూడా. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం కింద ఆవు పేడను వర్మీ కంపోస్టు తయారి కోసం కొంటామని ప్రకటించింది. ఇందుకు కిలో ఆవు పేడకు రెండు రూపాయలు చెల్లిస్తామని కూడా తెలిపింది. దీంతో రాష్ట్రంలోని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఆవులను కలిగివున్న రైతులు పేడను పోగు చేసి ప్రభుత్వానికి అమ్ముతున్నారు.

ఈక్రమంలో ధూరేనా గ్రామానికి చెందిన కమాన్ సింగ్ ఏకంగా 800 కిలోల ఆవు పేడను సేకరించాడు. వాటిని పిడకలుగా మార్చి కుప్పగా పోశాడు. అయితే.. ఇంత పెద్ద మొత్తంలో పేడ పోగైందని తెలుసుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 800 కిలోల పిడకలను ఎత్తుకెళ్లిపోయారు. షాక్ కు గురైన కమాన్ సింగ్ ఏంచేయాలో తెలీక జూన్ 15న దిప్కా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన పోగేసిన పేడ విలువ 1600 రూపాయలని.. వాటిని ఎత్తుకెళ్లిన వాళ్లని పట్టుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.