అసలే ఏపీ-తెలంగాణ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల వార్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. రెండు రాష్ర్టాల పంచాయతీ ఢిల్లీ పెద్దలకు చేరింది. మూడున్నర సంవ్సరాలుగా నలుగుతోన్న ఈ వార్ కి ఈసారైనా చెక్ పడుతుందని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. రేపోమాపో ఈ పంచాయతీ తేలనుంది. పాత ఎజెండాతోనే పెద్దలముందుకెళ్లిన రాష్ర్టాలకు ఈసారైనా పరిష్కారం దొరుకుతుందా?లేదా? అన్న మరోవైపు అనుమానాలు అంతే వేడెక్కిస్తున్నాయి. ఈ కుంపటిలో తాజాగా రెండు గ్రామాలు నీళ్ల కోసం కొట్టుకున్నాయి. మహిళా మణులే ఏకంగా ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడులు చేసుకున్నారు. అక్కడితే ఆగకుండా రాళ్లు రువ్వుకున్నారు.
ఈ వార్ ఇంకా ముదిరిపోవడంతో ఆ మహిళా మణుల భర్తలు రంగంలోకి దిగారు. దీంతో చిన్న వార్ గా మొదలైన ఫైట్ రెండు గ్రామాల యుద్ధంగా మారిపోయింది. రెండు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. స్పాట్ లో ఉన్న బైక్ లకు నిప్పంటించి సన్నివేశాన్ని వేడెక్కించారు. ఇలా దాడి..ప్రతి దాడి మధ్య కాసేపు అక్కడి సన్నివేశం వేడెక్కి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం నక్కలదిన్నె వడ్డేపల్లి, కేవీపల్లె నూతనకాల్వ గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. నీళ్లు తెచ్చుకునే క్రమంలో ముందుగా ఇరు గ్రామాల మహిళలు ఒకర్ని ఒకరు దుర్భాషలాడుకున్నారు. సహనం కోల్పోయిన ఒక లేడీ గ్యాంగ్ ప్రత్యర్ధి గ్యాంగ్ పై ఖాళీగా ఉన్న బీరుసీసాలు నేలకేసి కొట్టి విసిరారు. అటుపై ప్రత్యర్ధి బృందం అంతే వేగంగా రియాక్ట్ అయింది. ఇటు వైపు నుంచి బీరు సీసాలు రావడంతో..అటు వైపు నుంచి రాళ్లు రువ్వారు. ఇలా కాసేపు పెనుగులాట అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో బైకులకు నిప్పు అంటించడం సహా పలు కార్లు ధ్వసం అయ్యాయి.