తెలంగాణ, ఆంధ్రపదేశ్ నీటి యుద్ధం: కిషన్ రెడ్డికి ఆ ఛాన్స్ లేదు.!

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి సంబంధించి కేంద్రమే జోక్యం చేసుకోవాలి.. కేంద్రమే సమస్యను పరిష్కరించాలి. నిజానికి, ఈ పని గడచిన ఏడేళ్ళలో ఎందుకు మోడీ సర్కార్ చేయలేకపోయింది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి బోర్డులు ఏర్పాటయ్యాయి. ఈ బోర్డుల వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుల ద్వారా సమస్య పరిష్కారం కాదనే అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది. కాగా, బోర్డు సమావేశాల్లో తెలంగాణ వాదన గట్టిగా వుండాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారుల్ని ఆదేశించారు. ఇలాంటి ఆదేశమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా జారీ చేసేశారు అధికారులకి. అలాంటప్పుడు, సమస్యకు పరిష్కారమెలా దొరుకుతుంది.? కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కావాలన్నది కేసీయార్ వాదన.

కానీ, అలా జరిగితే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే, వరదల్ని భరించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి, సహజంగానే ఆ రాష్ట్రానికి నీటి కేటాయింపుల వాటా ఎక్కువగా వుంటుంది. ఇక, ఈ మొత్తం వివాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల పట్ల తనకు పూర్తి అవగాహన వుందనీ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి సమస్య పరిష్కారం కోసం తనవంతు ప్రయత్నిస్తాననీ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఇటీవల అరగంటపాటు కిషన్ రెడ్డి సమావేశమైన సమయంలో నీటి వివాదాల అంశం చర్చకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. కానీ, కిషన్ రెడ్డి జోక్యాన్ని తెలంగాణలోని అధికార పార్టీ సహించే అవకాశం వుండకపోవచ్చు. ఎందుకంటే, తెలంగాణలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీనే.