తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

Water Fight AP Vs TRS

Water Fight AP Vs TRS

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే కనిపిస్తోంది. మరోపక్క, ఏపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం.. కృష్ణా ట్రైబ్యునల్ వద్ద ఫిర్యాదు చేసింది కూడా. ఆంధ్రపదేశ్ కూడా తెలంగాణలో అక్రమంగా నిర్మించిన, నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేస్తామంటోంది. అందుబాటులో వున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. ఆయా పద్ధతుల్లో న్యాయ పోరాటం ఇరు రాష్ట్రాలూ చేస్తే.. తప్పెవరిదో తేలిపోతుంది.

కానీ, ఇలా తిట్టుకోవడమేంటి.? దొంగ.. గజదొంగ.. అంటూ పనికిమాలిన మాటలు కీలక పదవుల్లో వున్న నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని ఉద్దేశించి అనడమేంటి.? అయినా, గడచిన రెండేళ్ళలో ఈ నేతలు ఏం చేశారు.. నీళ్ళ దోపిడీ జరుగుతోంటే. చూస్తోంటే, ఇదేదో కావాలని రచ్చ చేస్తున్నట్టు వుంది తప్ప, తెలంగాణ ప్రజల మీద మమకారమో.. నీళ్ళ పంపకాలపై చిత్తశుద్ధితోనో జరుగుతున్న రాజకీయ రచ్చలా లేదు.

ఆంధ్రపదేశ్ నుంచి కూడా ప్రభుత్వ పెద్దలు, వివాదాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుని, ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు ఆలోచనలు చేసి వుంటే బావుండేదేమో. ఈ గొడవ రెండు రాష్ట్రాల మధ్య అంటే.. అది రాజకీయ నాయకుల కారణంగా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదంగా మారే ప్రమాదమేర్పడుతుంది. మధ్యలోకి ఇరు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలు దూరడం అప్పుడే షురూ అయ్యింది గనుక.. వివాదం మరింత ముదిరి పాకాన పడటం ఖాయం.