తెలియని మార్గాల నుంచి అత్యధిక విరాళాలు దక్కించుకున్న ప్రాతీయ పార్టీల్లో వైకాపా దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ వరుసలో తెదాపా ఐదవ స్థానంలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘానికి దేశంలో 23 ప్రాంతీయ పార్టీలు సమర్పించిన విరాళాలు, ఆడిట్ నివేదికల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) రూపొందించిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. దేశంలోని 23 ప్రాంతీయ పార్టీలకు 2018-19 ఆర్ధిక సంవత్సరంలో885.956 కోట్లు విరాళాలు రాగా, అందులో54.32 శాతం(481.276 కోట్లు) తెలియని మార్గాల నుంచి వచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి మార్గాల నుంచి అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీల జాబితాలో ఒడిశా కు చెందిన బీజేడీ(213.543 కోట్లు) తో ప్రథమ స్థానంలో ఉంది.
ఇక రెండవ స్థానంలో ఏపీకి చెందిన వైకాపా 100.504 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో శివసనే 60.73 కోట్లు, జేడీఎస్ 39.13 కోట్లు, తెలుగు దేశం 37.78 కోట్లతో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 90.798 శాతం( 436.99 కోట్లు) విరాళాలు సమకూరాయి. అయితే ఇలా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఇంతగానం విరాళాలు అందించిన ఆ ఆజ్ఞాత వాసులు వివరాలు మాత్రం ఎక్కడా దొరకలేదు. ఈ పార్టీలన్నింటి ఖాతాల్లో డబ్బు వివిధ రూపాల్లో జమ అయింది. కారణాలు ఏవైనా విరాళాలు అందుకున్న పార్టీల జాబితాలో దేశంలోనే రెండవ స్థానంలో నిలవడంతో వైకాపా నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు.
తమ పార్టీకి దేశం వ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు ఉందో? ఈ విరాళాల వెల్లువతో అద్ధం పడుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి తనయుడు జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైకాపా అనతి కాలంలోనే దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు దక్కించుకుందని ఈ సందర్భంగా అభిమానులు గుర్తుచేసారు. ప్రస్తుతం ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పిన్న వయసులోనే జగన్ సీఎం అవ్వడంతో ఏపీ రాజకీయ చరిత్రలో అదో రికార్డు కావడం గమనార్హం. అయితే రాజకీయ పార్టీలకు ఏదో రూపంలో బ్లాక్ మనీ వెళ్తుందని చెబుతుంటారు. అలా అజ్ఞాతవాసుల నుంచి అంత పెద్ద బ్లాక్ మనీ విరాళాల రూపంల వైకాపా ఖాతాల్లోకి మళ్లిందా? అన్నది తెలియాల్సి ఉంది.