వైకాపా నరసాపురం ఎంపీ రఘురాంకృష్ణం రాజు సొంత పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తనకు కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆయనపైనా..పార్టీ విధి విధానాలపై నా ఎంపీ మండిపడిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా రఘురాం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలకు ముందుగా ప్రభుత్వంపై మండిపడటంతో వైకాపా ఎమ్మెల్యేలు రఘురాం వ్యాఖ్యలకు ధీటైన సమాధానాలిచ్చారు. అదే జిల్లాకు చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎంపీ తీరును తప్పుబట్టారు. ఒక్కసారి పోటీ చేయడానికి మూడుసార్లు పార్టీ మారిన చరిత్ర రఘురాం సొంతమని మండిపడ్డారు.
తణుకు ఎమ్మెల్యే కార్మూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…నాడు పార్టీలో చేరడానికి జగన్ ఒప్పుకోకపోయినా..జగన్ ని తామే ఒప్పించి పార్టీలో చేర్పించామని, ఆకృతజ్ఞత కూడా లేకుండా రఘురాం మాట్లాడం సబబు కాదన్నారు. తమ ఓట్ల కంటే ఎంపీకి తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. రఘురాం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకం అని మండిపడ్డారు. ఇక నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ.. అందరు జగన్ వేవ్లో గెలిచామని, నామినేషన్ వేసి వెనక్కి వెళ్లిన చరిత్ర రఘురాందని దుయ్యబెట్టారు. ఆయనకు స్వగ్రామంలోనే ఎవరూ ఓట్లు వేయరని, అలాంటి ఆయన జగన్ దయ వల్ల ఎంపీగా గెలిచారని, ఇప్పుడు ఆయన్నే విమర్శించే స్థాయికి చేరుకోవడాన్ని ఏమనాలో? ఆయనకే తెలియాలని ఎద్దేవా చేసారు.
రఘురాంకు దమ్ముంటే తక్షణం రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఇంకా వైకాపా ఎమ్మెల్యేలు కొట్టు సత్యానారాయణ సహా పలువురు ఎమ్మెల్యేలు రఘురాం తీరును తీవ్రంగా ఆక్షేపించారు. రఘురాం ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీగా గాని గెలిచిన చరిత్ర లేదన్నారు. జగన్ ఫోటో తో ఎంపీగా గెలిచి ఇప్పుడు ఆయన్నే విమర్శించే స్థాయికి చేరాడంటే ఇది రాజకీయ కుట్ర కాక ఏమంటారని మండిపడ్డారు. పార్టీలో ఇలాంటి వాళ్లు ఉన్నా లేకపోయినా పెద్దగా ఉపయోగం ఉండదన్నారు.